Attack on Electricity Employee Viral Video : విద్యుత్ శాఖ అధికారులపై వినియోగదారుడి దాడి.. కత్తితో బెదిరిస్తూ..! - హైదరాబాద్ తాజా వార్తలు
Published : Oct 21, 2023, 12:55 PM IST
Attack on Electricity Employee Viral Video in Hyderabad : కరెంట్ బిల్ కట్టనందుకు సరఫరా నిలిపివేయగా.. విద్యుత్ శాఖ సిబ్బందిపై వినియోగదారుడు దాడి చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని మొగల్పురాలో చోటుచేసుకుంది. ఉమర్ చౌదరీ అనే వ్యక్తి.. గత కొంతకాలంగా బిల్లు చెల్లించకుండానే విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. పాతబస్తీలో బకాయి బిల్లుల వసూలు కోసం విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. బకాయి బిల్లు కట్టకుండా విద్యుత్ వినియోగిస్తున్నందుకు.. సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెప్పి కనెక్షన్ కట్ చేశారు.
కరెంట్ కట్ చేయడంతో.. సహనం కోల్పోయిన ఉమర్ జేబులోంచి కత్తి తీసి విద్యుత్ శాఖ సిబ్బందిని బెదిరించాడు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడి చేయడాన్ని విద్యుత్ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాతబస్తీలో గతంలో కూడా విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని.. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.