Ashu Reddy Drugs Case Update : 'ఆ మీడియా ఛానెల్స్‌పై పరువు నష్టం దావా వేస్తా' - హైదరాబాద్ డ్రగ్స్ కేసు
Ashu Reddy Drugs Case update : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సదరు ప్రముఖులు స్పందించారు కూడా. ఈ క్రమంలోనే కేపీ చౌదరి కాల్ లిస్టు జాబితాలో ఉన్న అషూ రెడ్డి మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఇప్పటికే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. తన ఫోన్ నంబర్‌ను టీవీ ఛానెళ్లు ప్రసారం చేయడంపై మండిపడ్డారు.
ఇదే వ్యవహారంపై తాజాగా అషూ రెడ్డి మరోసారి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. కొన్ని మీడియా ఛానెళ్లు తనను కించపరిచే విధంగా వార్తలు రాశాయని మండిపడ్డారు. తన ఫోన్ నెంబర్‌తో పాటు వ్యక్తిగత వివరాలను ప్రసారం చేశాయని ఆరోపించారు. మొబైల్ నెంబర్‌ను టెలికాస్ట్ చేయడం వల్ల తనకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని.. అందువల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంతో తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. తనను కించపరిచే విధంగా వ్యవహరించిన మీడియా ఛానల్స్‌పై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు.