Yadadri Bramhotsavam : యాదాద్రిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు - వార్షిక బ్రహ్మోత్సవాలు
Governor Tamilisai Visits Yadadri Today: యాదాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గవర్నర్ దర్శించుకోనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలల్లో గవర్నర్ తమిళిసై పాల్గొననున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగోరోజు కూడా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
Annual Bramhotsavam At Yadadri Temple: ఈ నెల 21న స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 3న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. మూడవరోజు సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శేషవాహన సేవపై నయనమనోహరంగా, వజ్ర వైడూర్యాలతో, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేదమంత్రాలు, వేదపారాయణలు మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Cultural events at Yadadri temple : మొదట దాదాపు రెండు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేదపారాయణాలు, వేదపండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండువగా, వీనుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు.. శేషవాహన సేవ విశిష్టతను భక్తులకు తెలియజేశారు.
అర్చకులు 27వ తేదీన ఎదుర్కోలు, 28న తిరుకల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. యాదాద్రి ఆలయ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ మాఢ వీధుల్లో వైటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రదర్శితమైన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ ఉమామహేశ్వరి బృందం 100 మంది కళాకారులతో చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందు చేసింది.
యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఈ నృత్య ప్రదర్శన చేపట్టారు. నరసింహ స్వామి పాటలతో చేపట్టిన నృత్యాలు భక్తులను స్థానికులను ఆకట్టుకున్నాయి. అనంతరం టీకే సరోజ, డాక్టర్ టీకే సుజాతల కర్ణాటక గాత్ర కచేరి, శ్రీసాయి బృందం మోర్సింగ్ వాయిద కచేరి అలరింపజేసింది.