ABVP Protest at Higher Education Office : ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలంటూ ఏబీవీపీ ధర్నా
ABVP Protest Higher Education Department Office : గురునానక్, శ్రీనిధి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ప్రభుత్వ యూనివర్సీటీలకు కేటాయిస్తామన్న నిధులను వెంటనే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా యూనివర్సిటీకి కేటాయిస్తామని చెప్పిన నిధులతో పాటు టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో నిబంధనలకు మించి అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆరోపించారు. తద్వారా విద్యార్థుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకే దొంగచాటున గురునానక్, శ్రీనిధి కళాశాలలు అడ్మిషన్లు తీసుకున్నాయని దుయ్యబట్టారు. నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహల్ స్టేడియానికి తరలించారు.