మూత్రపిండాలు (కిడ్నీలు) అనగానే మూత్రం తయారుచేయటమే గుర్తుకొస్తుంది. ఇదొక్కటే కాదు.. రక్తపోటును నియంత్రించటం దగ్గర్నుంచి రసాయనాల సమతుల్యతను కాపాడటం, ఎముకల పటుత్వానికి దోహదం చేయటం, ఎర్ర రక్తకణాల తయారీ, విటమిన్ డిని ఉత్తేజితం చేయటం, రక్తంలో ఆమ్ల తత్వం పెరగకుండా చూడటం వరకూ రకరకాల పనుల్లో పాలు పంచుకుంటాయి. సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, లవణాలను సమపాళ్లలో ఉంచుతాయి కూడా. మూత్రపిండాలు దెబ్బతింటే ఇవన్నీ అస్తవ్యస్తమవుతాయి. దురదృష్టమేంటంటే- ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రాకపోవటం. బాగా దెబ్బతినేంతవరకూ పైకి ఎలాంటి లక్షణాలు, సంకేతాలు కనిపించకపోవటం. ఒకో కిడ్నీలో సుమారు 10 లక్షల నెఫ్రాన్లుంటాయి. రక్తాన్ని వడపోసేవి ఇవే. దీర్ఘకాల కిడ్నీ జబ్బులో (సీకేడీ) ఇవి క్రమంగా క్షీణిస్తుంటాయి. మొదట్లో దెబ్బతిన్న నెఫ్రాన్ల పనిని చుట్టుపక్కల నెఫ్రాన్లు తీసుకుంటాయి గానీ ఎంతోకాలం సాయం చేయలేవు. నెమ్మదిగా ఇవీ దెబ్బతింటూ వస్తుంటాయి. ఇలా కిడ్నీల పనితీరు మందగిస్తూ.. చివరికి పూర్తిగా ఆగిపోయే స్థితి (కిడ్నీ వైఫల్యం) తలెత్తుతుంది. అప్పుడు డయాలసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం ఉండదు. అందువల్ల కిడ్నీలను కాపాడుకోవటం, ఒకవేళ దెబ్బతిన్నా పరిస్థితి మరింత క్షీణించకుండా చూసుకోవటం తప్పనిసరి.
నియంత్రణ మన చేతుల్లోనే..
దీర్ఘకాల కిడ్నీజబ్బుకు ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం. పొగ, మద్యం అలవాట్లు.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కిడ్నీ జబ్బు బాధితులు ఉండటం, కిడ్నీ వాపు (గ్లోమరులర్ నెఫ్రయిటిస్), ఇన్‌ఫెక్షన్లు (ఫైలోనెఫ్రయిటిస్), పుట్టుకతో తలెత్తే తిత్తుల (పాలీ సిస్టిక్ కిడ్నీ) వంటి జబ్బులు, మూత్రనాళంలో అడ్డకుంలు, ప్రొస్టేట్ ఉబ్బు, కిడ్నీలో రాళ్ల వంటివీ కిడ్నీ జబ్బుకు దారితీయొచ్చు. నొప్పి నివారణ మందులు విచ్చలవిడిగా వాడటమూ ముప్పుగా పరిణమిస్తోంది. కొందరిలో ఎలాంటి కారణాలూ బయటపడకపోవచ్చు. మనదేశంలో సుమారు 10% మంది ఏదో ఒకస్థాయిలో కిడ్నీజబ్బుతో బాధపడుతున్నారని అంచనా. తొలిదశలోనే గుర్తిస్తే కిడ్నీలు త్వరగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కాబట్టి ముప్పు కారకాలను అదుపులో ఉంచుకోవటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. కిడ్నీ జబ్బు తీవ్రం కాకుండా చూసు కోవటానికైనా, నివారణకైనా ఇవే ప్రధానం.
1. రక్తపోటు నియంత్రణ
కిడ్నీ జబ్బు చికిత్స, నివారణలో ఇది చాలా ప్రధానం. కిడ్నీ విఫలమైనవారిలో పావు వంతు మంది అధిక రక్తపోటు గలవారే! రక్తపోటు పెరిగితే రక్తనాళాలు, నెఫ్రాన్లు దెబ్బతింటాయి. దీంతో వడపోత సామర్థ్యం తగ్గి, ఒంట్లో ద్రవాల మోతాదులు పెరుగుతాయి. ఇది రక్తపోటు మరింత పెరిగేలా చేస్తుంది. అంటే ఇదో విష వలయంలా తయారై, కిడ్నీలను ఇంకాస్త త్వరగా దెబ్బతీస్తుందన్నమాట. కాబట్టి రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవటం తప్పనిసరి. మామూలుగా రక్తపోటు సుమారు 120/80 ఉండాలి. ఇది 140/90కి చేరుకుందంటే కచ్చితంగా మందులు వాడాల్సిందే. చిన్న వయసులోనే అధిక రక్తపోటు బారినపడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం మరింత ఎక్కువనే సంగతిని విస్మరించరాదు.
2. గ్లూకోజు అదుపు
మధుమేహంతో కిడ్నీ జబ్బు ముప్పు పెరగటమే కాదు, కిడ్నీలు త్వరగా దెబ్బతినే ప్రమాదమూ ఉంది. మధుమేహం గలవారిలో సగం మందికి కిడ్నీ జబ్బు తలెత్తుతుండటం.. డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరమైనవారిలో మూడింట ఒక వంతు మంది మధుమేహులే ఉంటుండటం దీనికి నిదర్శనం. రక్తంలో గ్లూకోజు పెరిగితే కిడ్నీల్లో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినొచ్చు. దీంతో వడపోత సామర్థ్యం తగ్గుతుంది. మధుమేహం గలవారికి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. ఇవీ కిడ్నీలను దెబ్బతీసేవే. గ్లూకోజును నియంత్రణలో ఉంచుకుంటే దీన్ని చాలావరకు తప్పించుకోవచ్చు. కాబట్టి తరచూ రక్తంలో గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవాలి. మూడు నెలల కాలంలో గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ 7% కన్నా తక్కువుండేలా చూసుకోవాలి.
3. బరువు అదుపు
ఊబకాయులకు కిడ్నీజబ్బు ముప్పు 2-7 రెట్లు ఎక్కువ. కిడ్నీలు ఇంకాస్త త్వరగానూ దెబ్బతింటాయి. కిడ్నీజబ్బు బారినపడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఊబకాయలే! అధిక బరువుతో కిడ్నీలపైనా భారం పెరుగుతుంది. ఊబకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం ముప్పులూ పొంచి ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలను దెబ్బతీసేవే. అందువల్ల బరువు అదుపులో ఉంచుకోవాలి. శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 కన్నా మించకుండా చూసుకోవాలి. ఊబకాయం మరీ ఎక్కవగా గలవారికి బేరియాట్రిక్ సర్జరీలు మేలు చేస్తాయి.
4. క్రమం తప్పకుండా పరీక్షలు
రక్తంలో క్రియాటినైన్, మూత్రంలో సుద్ద (అల్బుమిన్) పరీక్షలతోనే కిడ్నీల పనితీరును తెలుసుకోవచ్చు. జబ్బు తీవ్రమవుతుంటే వీటితో ముందుగానే పట్టుకోవచ్చు. కిడ్నీల పనితీరు మందగిస్తే క్రియాటినైన్ పెరుగుతుంది. దీని ఆధారంగానే వయసు, బరువు, ఎత్తు వంటివి పరిగణనలోకి తీసుకొని గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేటును అంచనా (ఈజీఎఫ్‌ఆర్) వేస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండి, ఈజీఎఫ్‌ఆర్ 90 మి.లీ. కన్నా ఎక్కువుంటే నార్మల్. ఇది 90 మి.లీ. కన్నా తగ్గిపోయి, కిడ్నీలు కొంతవరకు దెబ్బతింటే కిడ్నీ జబ్బు తొలిదశలో ఉన్నట్టే. అదే 89-60 మి.లీ. ఉంటే ఒక మాదిరి, 30-59 ఉంటే మధ్యస్థ, 15-29 ఉంటే తీవ్ర దశగా పరిగణిస్తారు. ఈజీఎఫ్‌ఆర్ 15 కన్నా తగ్గితే కిడ్నీ వైఫల్యం మొదలైనట్టే. త్వరలోనే డయాలసిస్ అవసరమవుతుందనీ అనుకోవచ్చు. అలాగే మూత్రంలో సుద్ద పోతోందేమో కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
- దీర్ఘకాల కిడ్నీజబ్బు గలవారు మొదట్లో నెలకోసారి క్రియాటినైన్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది.
- మధుమేహం వంటి కిడ్నీ జబ్బు ముప్పు కారకాలు గలవారు విధిగా ఒకసారి సీరం క్రియాటినైన్ పరీక్ష చేయించుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు బయట పడినట్టయితే ఆ వెంటనే పరీక్ష చేయించుకోవటం మంచిది. కిడ్నీ పనితీరులో ఏవైనా తేడాలుంటే ప్రతి 3 నెలలకోసారి, మామూలుగా ఉంటే ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. మిగతావాళ్లంతా 30 ఏళ్లు దాటాక ఏడాదికోసారి పరీక్ష చేయించుకోవాలి.
- చిన్నప్పుడే మధుమేహం బారినపడ్డవారు ఐదేళ్ల లోపే కిడ్నీ పనితీరును విధిగా పరీక్షించుకోవాలి.
5. మందులు తప్పకుండా
దీర్ఘకాల కిడ్నీ జబ్బులో చాలావరకు రక్తపోటు, గ్లూకోజు, కొలెస్ట్రాల్ నియంత్రించే మందులు ఇస్తుంటారు. వీటిని క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఇవి కిడ్నీ జబ్బు తీవ్రం కాకుండా, కిడ్నీ వైఫల్యంలోకి వెళ్లకుండా చూస్తాయి.
6. తగినంత నీరు
తగినంత నీరు తాగాలి. వ్యాయామం చేసేటప్పుడు, వేడి వాతావరణంలో ఇది మరింత ముఖ్యం. సాధారణంగా రోజుకు 2-3 లీటర్ల నీరు సరిపోతుంది. మరీ లెక్క పెట్టుకొని తాగలేమని అనుకుంటే ప్రతీ గంటకు ఒకట్రెండు గ్లాసుల నీరు తాగితే చాలు. కిడ్నీ, గుండె, కాలేయ జబ్బులుంటే మాత్రం డాక్టర్ సలహా మేరకు తగ్గించుకోవాలి.