మైక్రోస్కోప్‌లో అమాయకంగా కనిపించే కరోనా వైరస్ ప్రమాదకర ఆయుధంగా మారి జనాభా లెక్కలను తారుమారు చేస్తున్న సమయంలో మనం సాధించిన సాంకేతికతే మనల్ని కాపాడుతోంది. ఈ వైరస్ మన శ్వాసకోశాలను ముట్టడించటం ప్రారంభించగానే దాని జన్యు క్రమాన్ని ఛేదించి టీకాను తయారుచేసే పని ప్రారంభించాం. వైరస్లు కలిగించే పోలియో, చిన్నమ్మవారు, ధనుర్వాతం మొదలైన ఎన్నో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. నేడు శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను ఆమూలాగ్రం పరీక్షిస్తున్నారు. వైరస్లు సహజంగానే పరివర్తన చెంది కొత్త రకాలకు జన్మినిస్తాయి. వీటిలో కొన్ని రకాల వైరస్లు సుదీర్ఘకాలం మనగలుగుతూ ప్రకృతిలో భాగమైతే, కొన్ని బలహీనపడి అంతరించి పోతాయి.
బి.1.617 రకం కొవిడ్:
గత కొన్ని వారాలుగా బి.1.617 వైరస్ భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఇప్పటికే 40 దేశాలకు పాకింది. గతంలో బి.1.1.7 రకం వైరస్ బ్రిటన్ నుంచి ఢిల్లీకి చేరి పంజాబ్ ప్రాంతం వరకు విస్తరించింది. బంగాల్లో బి.1.618 రకం వైరస్ కొవిడ్‌ను కలిగిస్తుండగా, బి.1.617 రకం మిగతా వాటిపై పైచేయి సాధించి విస్తరిస్తోంది. ఇది మహారాష్ట్ర లోనూ విస్తారంగా ఉంది. 617 రకం 617.2 అనే కొత్త రకాన్ని కూడా తయారు చేసినట్టు ఇంగ్లాండ్ లో గుర్తించారు.
2020, అక్టోబర్‌లో భారత్‌లో గుర్తించిన ఈ రకం ఫిబ్రవరి 2021 కల్లా మహారాష్ట్రలోనే 60% రోగులకు కారణమైంది. ఇన్సాకోగ్ అనే వైరస్ జన్యువుల విశ్లేషణ సంస్థ, పూణె లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, హైదరాబాద్‌లోని సి.సి.ఎమ్.బి. ఆ వైరస్ల రకాలను గుర్తిస్తున్నారు. ఎన్.440.కె అనే రకం వైరస్‌ను కర్నూల్లో గుర్తించారు. ఇది 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతూ తీవ్ర వ్యాధి లక్షణాలను కలుగచేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాక చుట్టు పక్కల రాష్ట్రాలకు ఇది పాకింది. అయితే ఈ కర్నూల్ రకం వైరస్ నిదానంగా అంతరిస్తూ ఉంది. దాని స్థానంలో బి.1.1.7, బి.1.617 రకాలు విస్తరిస్తున్నాయి.