చాలామంది మహిళలకు అవాంఛిత రోమాలుంటాయి. కొందరికి పెదవుల పై భాగంలో ఉంటే.. మరికొందరికి గడ్డం దగ్గర, పొట్ట కింది భాగంలో ఉంటాయి. ఇలా ఉండటాన్ని 'హిర్సిటిజం' అంటారు. వాటిని కలిగి ఉండటం వల్ల మహిళలు ఏదో రకమైన కుంగుబాటుకు గురవుతుంటారు. బయట తిరగాలన్నా, ఏదైనా ఫంక్షన్లకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
అవాంఛిత రోమాలు ఎందుకు వస్తాయి?
పీసీఓడి, హార్మోన్స్‌లో అసమతుల్యత కారణంగా మహిళల శరీరంపై అనవసరమైన చోట్ల వెంట్రుకలు పెరుగుతాయి. థైరాయిడ్, అల్ట్రా సౌండ్ స్కానింగ్, హార్మోన్ల టెస్టులు చేసి వాటి పనితీరును పరీక్షిస్తారు. ఒకవేళ హార్మోన్ల విడుదలలో అసమతుల్యత ఉంటే దానికి తగిన చికిత్సను ప్రారంభిస్తూ.. అదే సమయంలో లేజర్ హెయిర్ రిమూవల్‌కు సంబంధించి సలహాలిస్తారు.
ఈ అవాంఛిత రోమాల నివారణకు ప్రస్తుతం రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ లేజర్ హెయిర్ రిమూవల్ టెక్నిక్ మిగితా వాటితో పోలిస్తే ఎంతో సురక్షితమైంది. ఈ చికిత్సలో వివిధ సిట్టింగుల్లో 20 నుంచి 30 శాతం హెయిర్ తగ్గిపోతుంది. సెషన్లు నడుస్తున్న క్రమంలో దట్టంగా ఉన్న వెంట్రుకలు కాస్త పలుచబడిపోతాయి. మల్టిపుల్ సెషన్లు చేసినప్పటికీ హెయిర్ మొత్తం పోకుండా బేబీ హెయిర్ లాగా ఉంటుంది. మీకు హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉండి ఈ చికిత్స చేయకుండా నేరుగా లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్ మెంట్తీసుకుంటే ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రావు.
కరెంట్‌తో తొలగింపు!
ఈ హెయిర్ రిమూవల్‌కు ఎలక్ట్రాలసిస్ అనే మరో టెక్నిక్‌ను వాడతారు. ఈ విధానంలో ఎలక్ట్రిక్ కరెంటును సన్నటి వైరు ద్వారా వెంట్రుక మూలాలకు పంపించి వాటిని తొలగిస్తారు. ఇది కొంచెం క్లిష్టమైన, నొప్పితో కూడుకున్న చికిత్స. కాబట్టి దీన్ని సాధారణంగా ఉపయోగించరు.
కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే ఏం చేయాలి?
ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చేస్తున్నాయి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. అసలీ వలయాలు ఎందుకు వస్తాయంటే.. ప్రధానంగా తగినంత నిద్ర లేకపోవడం. ఇదే కాకుండా.. జన్యువులు, హైపర్ పిగ్మెంటేషన్, ఎలర్జీ, వయసు పెరగడం, ఎండలో ఎక్కువగా తిరగడం, కంప్యూటర్, సెల్ ఫోన్ స్క్రీన్ ఎక్కువ సమయం చూడటం వల్ల కూడా ఇవి ఏర్పడతాయి.
ఆహారం కూడా ముఖ్యమే!
అయితే ఇవి ఏ కారణం వల్ల వస్తున్నాయో పరిశీలించుకుని తగిన చర్యలు తీసుకుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా.. మన ఆహారపు అలవాట్లు కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు వీటి నివారణకు వైద్య చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం మీరు డెర్మటాలజిస్టును సంప్రదిస్తే.. వలయాలు రావడానికి గల సరైన కారణాలను అంచనా వేసి దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు.
అవాంఛిత రోమాలున్నాయా..? డార్క్ సర్కిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. ఏ చికిత్స బెస్ట్..?