జీవితం ఓ ప్రవాహం. దీనికి ఆధారం మన లోపలి ప్రవాహం! అవును.. అదే ప్లాస్మా ప్రవాహం. శరీరంలోని అన్ని కణాలకు, అన్ని అవయవాలకు అత్యవసరమైన రక్తాన్ని కదిలించే జీవద్రవ్యం. ఆక్సిజన్‌ను మోసుకెళ్లే ఎర్ర రక్తకణాలు.. ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాలు, యాంటీబాడీలు.. రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్లెట్లు.. హార్మోన్లు, ఎంజైమ్‌లు, పోషకాలు.. ఒక్కటేమిటి? మన ప్రాణం నిలవటానికి అవసరమైన సమస్త సరంజామా అంతా ప్లాస్మాలో తేలియాడుతూనే అన్ని భాగాలకు చేరుకుంటాయి. అంటే ఇది కదిలితేనే మనం కదులుతామన్నమాట!
- మందూ మాకూ లేని కొవిడ్-19 చికిత్స విషయంలోనూ ఇది మనల్ని కదిలిస్తోంది. కొత్త కరోనా వైరస్‌ను మన శరీరం ఇంతకు ముందెన్నడూ ఎదుర్కొలేదు. దాంతో ఎలా పోరాడాలో మన రోగనిరోధకశక్తికి తెలియనే తెలియదు. ప్రస్తుతానికి దీనికి టీకాలూ లేవు. మనల్నిప్పుడు విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది ఇదే. వైరస్, బ్యాక్టీరియా వంటి హానికారక సూక్ష్మక్రిముల ఉద్ధృతి, వాటి దుష్ప్రభావాలు ఎలా ఉంటాయన్నది మన రోగనిరోధకశక్తి సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటాయి. రోగనిరోధకశక్తి బలంగా ఉండి, వైరస్ అంత ఉద్ధృతంగా లేదనుకోండి. రోగనిరోధక ప్రతిస్పందనలో భాగంగా పుట్టుకొచ్చే యాంటీబాడీలు తేలికగా వైరస్‌ను నిర్మూలించేస్తాయి.
- అదే వైరస్ బలంగా ఉండి, రోగనిరోధకశక్తి అంత బలంగా లేకపోతే ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా దాడిచేస్తుంది. అవయవాలు దెబ్బతిని, ప్రాణాలకూ ముప్పు వాటిల్లొచ్ఛు ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్లో జరుగుతున్నదిదే. ఇది కొత్త వైరస్ కావటం, దీన్ని మన రోగనిరోధకశక్తి గతంలో ఎప్పుడూ ఎదుర్కొని ఉండకపోవటం వల్ల ఉద్ధృతంగా దాడిచేస్తోంది. మరణాలూ ఎక్కువగానే సంభవిస్తున్నాయి. మరోవైపు ప్రామాణిక చికిత్సలూ లేవు. దీంతో అందుబాటులో ఉన్న అన్ని చికిత్సలనూ, అన్ని మందులనూ ప్రయోగించక తప్పటం లేదు.
- ఈ క్రమంలోనే కన్వల్సెంట్ ప్లాస్మా చికిత్స ఆశా కిరణంలా కనిపిస్తోంది. నిజానికిది కొత్త చికిత్సేమీ కాదు. గతంలో కరోనా తరగతికే చెందిన వైరస్ల మూలంగా విజృంభించిన సార్స్, మెర్స్ లాంటి జబ్బుల్లోనూ దీన్ని ఉపయోగించారు. ఆ మధ్య ఎబోలా బారినపడ్డవారికీ దీన్ని ఇచ్చారు. కొత్త కరోనా జబ్బు బాధితుల్లోనూ ఇది మంచి ఫలితం చూపిస్తున్నట్టు, ఇన్ఫెక్షన్ ఉద్ధృతితో పాటు మరణాలూ తగ్గుతున్నట్టు ఇతర దేశాల అనుభవాలూ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మనదగ్గరా దీనిపై ప్రయోగపరీక్షలు నిర్వహించటం ఆరంభించారు.
ఏంటీ చికిత్స?
శత్రువును ఎదుర్కోవటానికి సొంత బలం సరిపోవటం లేదు. అప్పుడేం చేస్తాం? ఇతరుల సాయం కోరతాం. కన్వల్సెంట్ ప్లాస్మా చికిత్స సరిగ్గా ఇలాంటిదే. జబ్బు నుంచి కోలుకుంటున్న దశను ‘కన్వల్సెన్స్’ అంటారు. ఇలాంటి దశలో ఉన్నవారి రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని వేరు చేసి జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కించటమే కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ. జబ్బు నుంచి కోలుకున్నవారి ప్లాస్మాలో వైరస్‌ను ఎదుర్కొవటానికి పుట్టుకొచ్చిన యాంటీబాడీలుంటాయి. అందువల్ల దీన్ని ఎక్కిస్తే జబ్బు నుంచి త్వరగా కోలుకోవటానికి వీలవుతుంది. ఎవరికైనా ఇన్ఫెక్షన్ తీవ్రమవుతోందంటే వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటమో, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటమో కారణం కావొచ్ఛు ఇలాంటివారికి ప్లాస్మా చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీబాడీలు వైరస్ల పని పట్టి, జబ్బు త్వరగా తగ్గేలా చేస్తాయి. ఒకరకంగా దీన్ని పరోక్ష టీకా చికిత్స అనీ అనుకోవచ్ఛు టీకా ఇచ్చినప్పుడు ఒంట్లోనే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. ప్లాస్మా చికిత్సలో ఇతరుల్లో తయారైన యాంటీబాడీలు శరీరానికి అందుతాయి. ఇవి ఇన్ఫెక్షన్ తగ్గటానికి తోడ్పడతాయి.
రెండు రకాలు
యాంటీబాడీలలో ప్రధానంగా ఐజీఎం, ఐజీజీ అని రెండు రకాలుంటాయి. ఐజీఎం యాంటీబాడీలు మన ఒంట్లో వారం రోజుల వరకు ఉంటాయి. ఐజీజీ యాంటీబాడీలు ఇన్ఫెక్షన్ మొదలైన రెండు వారాల తర్వాత పుట్టుకొస్తాయి. ఇవి ఐదారు నెలల పాటు అలాగే ఉంటాయి. కొందరిలో ఏడాది వరకూ ఉండొచ్ఛు కొన్ని రకాల వైరస్‌లతో పుట్టుకొచ్చే యాంటీబాడీలు 2-3 ఏళ్ల వరకూ ఉండొచ్ఛు కొన్నయితే జీవితాంతమూ ఉండొచ్చు.
ప్లాస్మా ఎవరి నుంచి?
ప్లాస్మాను అందరి నుంచి తీసుకోవటం కుదరదు. దీనికి పరిమితులున్నాయి. కరోనా జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నవారే ప్లాస్మాను ఇవ్వటానికి అర్హులు. కోలుకోవటానికి ముందు రెండు సార్లు వైరస్ లేదని నిర్ధారణ అయ్యిండాలి. అలాగే 28 రోజుల తర్వాత కూడా జబ్బు లక్షణాలేవీ ఉండకూడదు. రక్తంలో హిమోగ్లొబిన్ 12.5% కన్నా ఎక్కువగా ఉండాలి. బరువు 55 కిలోల కన్నా ఎక్కువగా ఉండాలి. 18-50 ఏళ్ల మధ్యలో ఉన్నవారి నుంచే ప్లాస్మాను సేకరించాల్సి ఉంటుంది. వీరికి గుండె వేగం, రక్తపోటు వంటివన్నీ మామూలుగా ఉండాలి. రక్తం ద్వారా సంక్రమించే హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి జబ్బులేవీ ఉండకూడదు. రక్తం గ్రూపులూ ఒకటే అయ్యిండాలి. ఇవన్నీ సరిపోయిన వారి నుంచే ప్లాస్మాను తీసుకుంటారు. యాంటీబాడీల సంఖ్య ఎక్కువగా ఉండటమూ ముఖ్యమే. మహిళల విషయంలో- గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరు నెలల లోపు అబార్షన్లు అయినవారు ప్లాస్మా ఇవ్వటానికి అర్హులు కారు.
చికిత్స ఎవరికి అవసరం?