తిన్నది ఒంటికి పడనప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద రావడం మనకు అనుభవమే. ఈ రకమైన అలర్జీ బాధలు పెద్దలనే కాదు పిల్లల్ని కూడా వేధిస్తాయి. తమకు పడని ఆహార పదార్థాలు తిన్నా.. ముట్టుకున్నా లేక శ్వాసించినా.. ఈ బాధలు మొదలవుతుంటాయి. ఈ అలర్జీల మూలంగా ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది పిల్లలకి. ఇలా చిన్నారులను వేధించే అలర్జీల గురించి తెలుసుకుందాం.
చిన్నారుల్లో అలర్జీలు ఎన్ని రకాలుగా వస్తాయి?
ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి.
- స్కిన్ అలర్జీ
- ఫుడ్ అలర్జీ, ఎయిర్ అలర్జీ
- అలర్జిక్ రైనైటీస్
- ఆస్తమా
ఇవి చిన్ని పిల్లల్లో ఎక్కువగా చూస్తాము.
చిన్నపిల్లల్లో వచ్చే అలర్జీలను ఎలా గుర్తించాలి?
పిల్లల్లో అలర్జీలను చాలా సులువుగా గుర్తించవచ్చు. వారి పడని వస్తువు లేక ఆహారం తీసుకున్నప్పుడు వారికి వెంటనే చర్మంపై దద్దుర్లు రావడం మొదలవుతుంది. గాలి ద్వారా వచ్చేవి అయితే వారికి తుమ్ములు వస్తుంటాయి. వారికి చర్మం ఎర్రగా అవుతుంది. ఆ ప్రాంతంలో అంతా ఎక్కువ దురద ఉంటుంది. ఇలాంటి వాటి ద్వారా పిల్లల్లో అలర్జీని గుర్తించవచ్చు.
పిల్లల్లో అలర్జీలు రావడానికి కారణాలు ఏంటి?
ఎక్కువగా పిల్లలకు ఆవు పాలు తాగిస్తుంటారు. కొందరికి ఇందులో ఉండే ప్రోటీన్లు పడవు. దీని వల్ల వాంతులు అవుతాయి. డయోరియా కూడా రావచ్చు. కొందరికి సీ ఫుడ్స్ తీసుకుంటే వస్తాయి. చాపలు, రొయ్యలు, పీతలు లాంటివి అందరికీ పడవు. అవి తీసుకుంటే వారికి అలర్జీ వస్తుంది. ఆ సమయంలో వాటిని దూరం ఉంచాలి. మరికొంతమందికి నట్స్ కూడా సరిపోవు. పీనట్స్, ఆల్మండ్స్, క్యాషియోనట్స్ లాంటివి పడకపోతే దూరం పెట్టాలి.
పిల్లల్లో ఎగ్జిమా తగ్గక పోతే ఏం చేయాలి?
మోకాళ్లు, మోచేతుల దగ్గర ఎక్కవుగా ఎగ్జిమా వస్తుంది. ఆ సమయంలో డాక్టర్ల సలహా మేరకు సంబంధిత క్రీమ్లను ఉపయోగించాలి. వాటిని వాడడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతే స్టిరాయిడ్ క్రీమ్లను వాడాలి.
మరిన్ని విషయాల కోసం కింద ఉన్న వీడియోను పూర్తిగా చూడండి...
పిల్లలకు తరుచూ అలర్జీ వస్తుంటే.. దేని ద్వారా వస్తుంది అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ఆ వస్తువులను వారికి దూరంగా ఉంచాలి. మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
ఇదీ చూడండి:మగవారు అందంగా కనిపించాలంటే.. ఇవి పాటించండి!