గుడ్డు పోషకాల నిలయం. ఇందులో మాంసకృత్తులు(ప్రొటీన్), అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి-కాంప్లెక్స్ విటమిన్లు, డి-విటమిన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తింటే బరువు పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. దీనికి కారణం పచ్చసొనలోని కొలెస్ట్రాలే.
అయితే.. కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు అంత ఎక్కువగా ఏమీ పెరగటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో కేలరీలు తక్కువ. పైగా చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. ఇలా ఇది పరోక్షంగా బరువు తగ్గటానికీ తోడ్పడుతుందన్నమాట.