తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

'మునగ'తో అందంలో మునిగి తేలుదాం! - etv bharat health

వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉండాలని కోరుకుంటున్నారా? మీ చర్మం సహజసిద్ధంగా ప్రకాశవంతంగా కనిపించాలని ఆశపడుతున్నారా? దృఢమైన కురులు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మునగ నూనె ఉపయోగించాల్సిందే. ఎలా అంటారా..? పూర్తి కథనం చదివేయండి.

try-drum-stick-oil-for-incredibly-healthy-skin-and-hair
'మునగ'తో అందంలో మునిగి తేలుదాం!

By

Published : Jul 28, 2020, 10:27 AM IST

Updated : Jul 28, 2020, 11:54 AM IST

మునగ నూనె మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. అందంతో పాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేసే ఈ తైలం వల్ల సౌందర్యపరంగా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. అందాన్ని సంరక్షించుకోవడానికి మునగ నూనెని ఎలా ఉపయోగించాలో మనమూ తెలుసుకుందామా..

మునక్కాయల్లో ఉండే గింజలను ఎండబెట్టి, వాటి నుంచి ఈ మునగ నూనెను తీస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల అటు ఆరోగ్యపరంగానే కాదు.. ఇటు సౌందర్యపరంగా కూడా ప్రయోజనాలు పొందచ్చు. అవేంటంటే..

'మునగ'తో అందంలో మునిగి తేలుదాం!

మెరిసే చర్మానికి..

మునగ నూనె చర్మానికి రాసుకోవడం ద్వారా సహజసిద్ధంగా తగినంత తేమని అందించడమే కాకుండా కాలుష్యం కోరల్లో చిక్కుకొని పాడైన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అలాగే రోజువారీ పనుల వల్ల కలిగే అలసట, ఒత్తిళ్ల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఫలితంగా చర్మం మృదువుగా మారడమే కాకుండా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది. తాజా అనుభూతి కలుగుతుంది.

'మునగ'తో అందంలో మునిగి తేలుదాం!

పొడిచర్మానికి..

పొడిచర్మతత్వం ఉన్న వారికి ఈ నూనె చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది నేరుగా చర్మపు లోపలి పొరల్లోకి ఇంకిపోతుంది కాబట్టి జిడ్డుగా అనిపించదు. పొడిబారి, పొట్టు రాలే చర్మ సమస్యకి ఇదొక మంచి పరిష్కారం. అలాగే పగిలిన పెదవులకు దీన్ని అప్త్లె చేసుకుంటే అవి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్, మినరల్స్.. చర్మానికి తగినంత తేమతో పాటు పోషణ కూడా అందిస్తాయి.

'మునగ'తో అందంలో మునిగి తేలుదాం!

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా..

మునగ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మం నవయవ్వనంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే ఇందులోని విటమిన్ సి కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. కాబట్టి వృద్ధాప్య ఛాయలు అస్సలు దరిచేరవు. ఒకవేళ ముఖంపై సన్నని గీతల సమస్య ఉంటే అది కూడా తగ్గుముఖం పట్టి తాజాగా, అందంగా కనిపించే చర్మం మీ సొంతమవుతుంది. స్నానం చేసిన తర్వాత ఈ నూనెతో చర్మానికి మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల రోజంతా తేమ నిలిచి ఉండేలా చేస్తుంది. పగటి పూట ఇబ్బంది అనుకునేవారు రాత్రి పూట నిద్రించే ముందు ఈ నూనెని చర్మానికి అప్త్లె చేసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

మచ్చలు పోగొట్టడానికి..

మునగ నూనెలో విటమిన్ సి, ఇ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి. కాబట్టి చర్మంపై ఉండే నల్లమచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్.. వంటి సమస్యలకు చక్కని పరిష్కారంగా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే దీనికి ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ గుణాల వల్ల చర్మంపై ఏర్పడిన కాలిన మచ్చలు, గాయాలు.. మొదలైనవి కూడా తగ్గుముఖం పడతాయి. చర్మం తిరిగి ప్రకాశవంతంగా, అందంగా మారుతుంది.

'మునగ'తో అందంలో మునిగి తేలుదాం!

కురులకు..

మునగ నూనె కేవలం చర్మానికే కాదు.. కురులకు కూడా తగినంత తేమని అందిస్తుంది. ఇందుకు కాస్త మునగ నూనె తీసుకొని కేశాలు తడిగా ఉన్నప్పుడు కుదుళ్లలోకి చేరేలా మృదువుగా మర్దన చేయాలి. ఈ నూనెని తరచూ ఉపయోగించడం ద్వారా దృఢమైన కురులు మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే చుండ్రు, చిట్లిన చివర్లు.. వంటి కురుల సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.

'మునగ'తో అందంలో మునిగి తేలుదాం!

ఇతర ప్రయోజనాలు..

మునగ నూనెని ఫేషియల్ క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల ఇది ఎండ కారణంగా కమిలిన చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.

దీన్ని హెయిర్ సీరమ్‌గా కూడా వినియోగించవచ్చు.

దీన్ని రాత్రి పడుకునే ముందు కురులకు, చర్మానికి అప్త్లె చేసుకోవడం వల్ల చక్కగా నిద్ర పట్టేలా చేయడమే కాక రక్తపోటుని కూడా ఇది నియంత్రిస్తుంది.

చూశారుగా.. మునగ నూనె వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో..! మీరు కూడా వెంటనే మీ సౌందర్య సంరక్షణకు ఉపకరించే అంశాల జాబితాలో దీన్ని చేర్చుకోండి.. ఆరోగ్యవంతమైన చర్మ, కేశ సంపదతో అందంగా మెరిసిపోండి.

ఇదీ చదవండి: రోగనిరోధకశక్తిని పెంచుకోవాలంటే మునగాకు తినాల్సిందే!

Last Updated : Jul 28, 2020, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details