తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కొవిడ్​ను ఎదుర్కోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..

ప్రాణాంతక విషపు వైరస్‌ నుంచి బయటపడాలంటే..మన ఒంట్లోని వ్యాధినిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేసుకోవడమే మార్గం. ఇమ్యూనిటీ బలంగా ఉంటే కరోనా వైరస్‌ మాత్రమే కాదు. ఇతరాత్ర చాలా జబ్బుల నుంచి కూడా కాపాడుకోవచ్చు. ఇమ్యూనిటీని పటిష్ఠంగా ఉంచుకునేందుకు ఏం తినాలి? ఎలాంటి ఆహారపదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి?

ఆరోగ్యం
వసుధర కథనాలు

By

Published : Apr 25, 2021, 7:41 PM IST

కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి మందులూ రాలేదు. కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన మళ్లీ బూస్టర్‌ డోసు వేసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాణాంతక విషపు వైరస్‌ నుంచి బయటపడాలంటే..మన ఒంట్లోని వ్యాధినిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేసుకోవడమే మార్గం. ఇమ్యూనిటీ బలంగా ఉంటే కరోనా వైరస్‌ మాత్రమే కాదు. ఇతరాత్ర చాలా జబ్బుల నుంచి కూడా కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకోవచ్చు. కరోనాపై పోరులో ఇమ్యూనిటీని పటిష్ఠంగా ఉంచుకునేందుకు ఏం తినాలి? ఎలాంటి ఆహారపదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి?

వారిపైనే వైరస్​ ప్రభావం

గతంలో వచ్చిన వైరస్‌లతో పోల్చుకుంటే కరోనా పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. ప్రతి వ్యక్తిలో రోగనిరోధక శక్తి బలీయంగా ఉంటే.. కరోనా మనల్ని ఏమీ చెయ్యలేదు. ఇప్పటి వరకు సంభవించిన కరోనా మరణాలను పరిశీలిస్తే.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఈ మహమ్మారికి ఎక్కువగా బలవుతున్నారు. అంటే వ్యాధినిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిపైనే కరోనా వైరస్‌ తన ప్రతాపం చూపుతోందన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో మనలోని వ్యాధినిరోధక యంత్రాంగాన్ని పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి మనలోని ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహరంపై దృష్టి పెట్టాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఏమి తినాలంటే..

కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే భౌతిక దూరం పాటించడంతోపాటు, ఇమ్యూనిటీని పెంచుకోవాలి.దీనికోసం పండ్లు, కూరగాయల్ని అధికంగా తీసుకోవాలి. ప్రధానంగా చిరుధాన్యాలను డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోవడం మరీ మేలు. పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్‌-సి అందుతుంది. విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంటే.. మనలోని వ్యాధి నిరోధక శక్తి కూడా బాగుంటుంది. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, కమల, నారింజ వంటి పండ్లను అధికంగా తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, బొప్పాయి, గ్రీన్‌ టీ వంటి వాటికి మన ఒంట్లో రోగ నిరోధకతను పెంచే గుణం ఉంది. వీటిని తరచుగా తీసుకోవాలి.

మాంసాహారం తినొచ్చా..

మాంసాహారం విషయానికోస్తే చేపలు తినడం మేలు. బొచ్చలు, శీలావతి రకం వంటి చేపల్ని, పీతల్ని కూడా తీసుకోవచ్చు. పీతల్లో జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలు ఉండటంతో.. మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇంకేమి చేయాలి..

మన ఒంట్లో రోగ నిరోధక యంత్రాంగాన్ని పటిష్ఠంగా ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లకు తోడుగా నిత్యం కాసేపు వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. కరోనాను కట్టడి చేయడానికే కాదు. ఇతరాత్ర ఆరోగ్య సమస్యల్ని దూరంగా ఉంచడానికి వ్యక్తిగతంగా సామాజికంగానూ పరిశుభ్రతను పాటించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి. భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించాలి. అప్పుడే మహమ్మారి కరోనాను మనం కట్టడి చేయగలం.

ఇదీ చూడండి:తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?

ABOUT THE AUTHOR

...view details