ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య ముప్పు నుంచి ప్రజల్ని తప్పించటం అతిపెద్ద సవాలుగా మారుతుంది. పలు నివేదికలు, అధ్యయనాలు ఇలా హెచ్చరిస్తూనే ఉన్నాయి. వీటిని ఖాతరు చేయకపోవటం వల్లే ఈ సమస్యలన్నీ. వైరస్, బ్యాక్టీరియా, పారాసైట్స్ వంటివి ఆహార పానీయాల్లో చేరి క్షణాల్లో లక్షల సంఖ్యలో పెరిగిపోవడం. ఆ సమయంలో వాటిల్లోంచి కొన్ని విషపదార్థాలు వెలువడి జీర్ణవ్యవస్థను, మొత్తం అంతర వ్యవస్థను రోగగ్రస్థం చేయడం. ఇదీ దుస్థితి. ఏవైతే మనం ప్రోటీన్లు అనుకుని తింటున్నామో ఇప్పుడవే మెల్లగా శరీరాన్ని విషతుల్యం చేసి చివరకు కొత్త వ్యాధులకు కారణవుతున్నాయి. ఈ విషపదార్థాలు ముందు పేగుల మీద తమ ప్రభావం చూపుతాయి. తరవాత నుంచి సమస్యలు మొదలవుతాయి.
10 మందిలో ఒకరు
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆహార పదార్థాలు విషతుల్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షిత ఆహారం అందటం ద్వారానే ప్రజారోగ్యానికి భరోసా ఉంటుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆహారం విషతుల్యం అవుతున్న కారణంగా... ఏటా ప్రతి 10మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. అతిసార మొదలు... కేన్సర్ వరకు రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. అసురక్షిత ఆహారం కారణంగా మధ్యాదాయ దేశాల్లో ఏటా 110 బిలియన్ డాలర్ల మేర ఆర్థికనష్టాలు తప్పటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల ఐదేళ్ల లోపు చిన్నారుల్లో దాదాపు 40% మంది అనారోగ్యానికి గురవుతున్నారని... లక్షా 25 వేల మంది పిల్లలు మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ నివేదిస్తోంది. కలుషిత ఆహారం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 55 కోట్ల మంది డయేరియాతో ఇబ్బందులు పడుతుండగా.. 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇలా అడ్డుకోవచ్చు
సరైన పద్ధతుల్లో ఆహారం వండితే 200 రోగాలు అడ్డుకోవచ్చన్నది డబ్ల్యూహెచ్ఓ ప్రధానంగా చెబుతున్న మాట. కానీ... ఆహార పదార్థాల విషయంలో ఎవరూ ప్రమాణాలు పాటించటం లేదు. ఇదే విషయం గతంలో ఐక్యరాజ్యసమితి ఆహారవిభాగం కూడా ప్రస్తావించింది. ఈ సమస్య ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. పలు నివేదికలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. జాతీయ ఆహార భద్రత ప్రమాణాల మండలి-ఎఫ్ఎస్ఎస్ఐఏ ఇటీవల విడుదల చేసిన నివేదికే...ఇందుకు ఉదాహరణ. అందరికీ ఆహారభద్రత మాట అటుంచి... అసలు నాణ్యమైన ఆహారం అందటమే గగనమైపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న వివిధరకాల ఆహారోత్పత్తుల్లో 28.5%.. నాణ్యతప్రమాణాలకు దూరంగా ఉన్నట్టు వెల్లడించింది.
వాటితో ప్రమాదం