Rice flour face pack benefits in Telugu : నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, ఎండవల్ల ఏర్పడిన నల్లదనం, మొటిమలు, పొడారే చర్మం, కళ్ల కింద నల్లని వలయాలు, ముడతలను బియ్యప్పిండి లేపనాలతో దూరం చేయొచ్చు. అందుకేం చేయాలంటే... ముందు జల్లించిన మెత్తని పిండిని సిద్ధం చేసుకోవాలి. అరకప్పు నీటిని మరిగించి ఇందులో బ్లాక్‌టీ బ్యాగును మూడు నిమిషాలుంచి తీసేయాలి. ఈ నీటిలో చెంచా చొప్పున బియ్యప్పిండి, తేనె వేసి పేస్టులా చేసి ముఖానికి లేపనంలా రాస్తూనే వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. పావుగంట ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేస్తే, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ముఖచర్మంలో నిల్వ ఉన్న ట్యాక్సిన్లను బయటకు పంపి, నల్లని మచ్చలు, మొటిమలను తగ్గేలా చేస్తాయి.
పొడిచర్మానికి..రెండు చెంచాల చొప్పున బియ్యప్పిండి, కలబంద గుజ్జు, తురిమిన కీరదోస గుజ్జు ఒక గిన్నెలో వేసి పేస్టులా కలపాలి. దీన్ని ముఖానికి రాసి, 20 నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ఈ లేపనం వేసే ముందు ముఖాన్ని తడిపొడిగా చేస్తే చర్మం బాగా పీల్చుకుంటుంది. పొడిచర్మం ఉన్నవారు ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేస్తే చర్మం తేమగా మారుతుంది. సాగే గుణాన్ని తెచ్చుకుంటుంది. వారానికొకసారి ఇలా చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.