Reasons for Weight Gain in Middle Age: నేటి తరాన్ని ఆరోగ్య పరంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు.. జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామం, డైట్ అంటూ మొదలు పెడతారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు. దీంతో.. సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. బరువు పెరగడం చిటికెలో పని.. కానీ.. అదే బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది.
కొంతమంది నవ యవ్వనంలో మెరుపు తీగలా ఉంటారు. కానీ, నాలుగు పదులు దాటగానే శరీరాకృతి మారిపోతుంది. అందుకు సంబంధించి.. ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం సాధ్యం కాదు. ఇలా నడి వయసులో బరువు పెరగడానికి ప్రధాన కారణం.. ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం. నిజానికి, కార్బొహైడ్రేట్లు లభించే ఆహార పదార్థాలు కూడా మనకు ముఖ్యమైనవే. కాకపోతే మోతాదు మించకూడదని నిపుణులు చెబుతున్నారు.
మీకు బ్లూ టీ గురించి తెలుసా? బరువు తగ్గి నాజూగ్గా మారిపోతారు!
65 ఏళ్ల లోపు వారిపై అధ్యయనం: బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. సిరి ధాన్యాలు, పండ్లు, గంజి పదార్థాలు లేని కూరగాయలు తింటే నడి వయసులో తక్కువ బరువు పెరుగుతాం. మరోవైపు రిఫైన్డ్ ధాన్యాలు, గంజి పదార్థం ఉండే కూరగాయలు, చక్కెర కలిగిన పానీయాలు ఊబకాయానికి దారితీస్తాయి. 65 సంవత్సరాల లోపు వయసు కలిగిన 1లక్షా 36వేల 432 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.
బరువు తగ్గడానికి "వాటర్ థెరపీ" - జస్ట్ నీళ్లు తాగితే చాలు కొండలాంటి పొట్ట వెన్నలా కరిగిపోతుంది!
సర్వేలో పాల్గొన్నవారంతా తమ పేరు నమోదు చేసుకున్న సమయంలో పరిపూర్ణ ఆరోగ్యవంతులే. తమ ఆహారం, జీవనశైలి, ఇతర ఆరోగ్య విషయాల గురించి పరిశోధకులకు సమగ్ర సమాచారం అందించారు. 2 నుంచి 4 సంవత్సరాల చొప్పున.. 24 సంవత్సరాల వ్యవధిలో వివరాలను సేకరించారు. సర్వేలో పాల్గొన్నవారు ప్రతి నాలుగు సంవత్సరాలు 1.5 కిలోలు, మొత్తం 24 ఏండ్ల కాలంలో 8.8 కిలోల బరువు పెరిగారు. అయితే, వీరిలో ఎక్కువగా రిఫైన్ చేసిన ధాన్యాలు, యాడెడ్ షుగర్స్, చక్కెర పానీయాలు, బఠానీలు, మొక్కజొన్న, ఆలుగడ్డలు లాంటి గంజి పదార్థం ఉన్న కూరగాయలను తిన్నవాళ్లు ఎక్కువ బరువు పెరిగారని అధ్యయనంలో స్పష్టం చేశారు.