కందిపప్పు
కందిపప్పు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనిలో అధిక మోతాదులో లభించే ఫోలిక్ యాసిడ్ మహిళలకు అవసరమైన కీలక విటమిన్. ముఖ్యంగా గర్భిణుల్లో పిండం ఎదుగుదలకు ఇది ఎంతో ముఖ్యం. కందిపప్పుని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, మేలు చేసే కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు అందుతాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. వీటితో పాటు క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి వంటివీ పుష్కలంగా లభిస్తాయి. కందిపప్పు తింటే కొన్ని రకాల గుండె వ్యాధులు, క్యాన్సర్లతో పాటు టైప్-2 డయాబెటిస్ వంటివీ అదుపులో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
సెనగపప్పు
శాకాహారం తీసుకునేవారు సెనగపప్పును తరచుగా వంటల్లో వాడటం వల్ల దీని నుంచి తగిన మోతాదులో ప్రొటీన్లు అందుతాయి. కాపర్, మాంగనీస్ ఖనిజాలు ఎక్కువే. మధుమేహమూ అదుపులో ఉంటుంది.
మినపపప్పు
పప్పుధాన్యాల్లో ప్రొటీన్, ఇనుము ఎక్కువగా లభించే రకం ఇది. ఈ పప్పులోని పోషకాలకు శరీరంలో శక్తి స్థాయుల్ని పెంచి, చురుగ్గా ఉండేలా చేసే శక్తి ఎక్కువ. ముఖ్యంగా నెలసరి వయసులో ఉన్నవారి శరీరంలో ఇనుము లోపించకుండా ఉండాలంటే ఈ పప్పుకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అలానే మాంసాహారం తిననివారు దీన్ని తీసుకోవడం వల్ల తగినంతగా ప్రొటీన్ శరీరానికి అందుతుంది. అధికంగా తీసుకోవాలి. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలూ అధికమే.