పరిశుభ్రత పాటించటం మనకు కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచి మన ప్రాథమిక స్థాయి పాఠాల్లో ఒక భాగం. ఈ విషయంలో కరోనా మహమ్మారి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నేర్పింది. పరిశుభ్రతను మొదటి ప్రాధాన్యంగా, అలవాటుగా మార్చుకునేలా చేసింది.
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థతో పాటు పలు జర్నల్‌లు స్పష్టం చేశాయి. చాలా వస్తువుల ఉపరితలాలపై ఈ వైరస్ కొన్ని గంటలపాటు జీవించగలదని గుర్తించారు పరిశోధకులు. ఫలితంగా ఉపరితలాలను తాకి మన ముఖాన్ని ముట్టుకుంటే వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో కళ్లద్దాలు, లెన్స్‌లు ఉపయోగించే వ్యక్తులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరు వ్యక్తిగత శుభ్రతతో పాటు కళ్లకు ధరించే అద్దాలు, ఐ లెన్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇందుకు సంబంధించి నోవా ఐ-వేర్ వైస్ ప్రెసిడెంట్ పమ్మీ జమాల్పూడియా కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.
- కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లను ముట్టుకోవటానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బుతో కడిగిన తర్వాత శుభ్రమైన టవల్‌తో చేతులను తుడుచుకోవాలి. ఆ తర్వాతే వాటిని అమర్చుకోవాలి. వీటిని తాకేముందు ఎటువంటి కృత్రిమ మాయిశ్చరైజర్, సౌందర్య సాధనాలను రాసుకోకూడదు.
- కళ్లద్దాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. తేలికపాటి డిటర్జెంట్ ఉండే క్లీనింగ్ సొల్యూషన్‌తో కడగాలి. ఇది వాటిపై ఉండే సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ముఖ్యంగా ముక్కును అదిమిపట్టే ప్యాడ్లు, హ్యాండిల్ శుభ్రం చేయాలి. టవల్‌తో తుడిచిన తర్వాతే ఉపయోగించాలి.
- అవసరం లేనప్పుడు వాటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లోనే భద్రపరచాలి. ఈ బాక్సులను ఎప్పుడూ ఒకే ప్రదేశంలో ఉంచటం మంచిది. ఎక్కడంటే అక్కడ పెడితే దుమ్ము చేరే ప్రమాదం ఉంది.
- మీ ఫ్రేములు, అద్దాలను ఎప్పుడూ జాగ్రత్తగా పట్టుకోండి. గ్రిప్పింగ్ వల్ల అద్దాలు వంగకుండా, ధరించడానికి అసౌకర్యంగా మారకుండా ఉంటాయి.
- వీటిని తీసేటప్పుడు మీ ముఖాన్ని తాకకుండా ఉండటం అసాధ్యం. అందువల్ల చేతులను శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం.
- కళ్ల జోడుపై మురికి భారీగా పేరుకుపోయి ఉంటే ప్రొఫెషనల్ క్లీనింగ్‌ను ఆశ్రయించటం మంచిది. దీని వల్ల కళ్లద్దాలు ఎక్కువ రోజులు మన్నుతాయి.
కళ్ల ద్వారా కరోనా వైరస్ సోకకుండా కళ్లజోడు సహాయపడుతుందని కంటి నిపుణులు ధ్రువీకరించారు. అయితే వీటిని ధరించే వారు పైన సూచించిన చిట్కాలను పాటించటం చాలా ముఖ్యం. అప్పుడే వైరస్‌ను సోకకుండా మనల్ని మనం కాపాడుకోలగమని అంటున్నారు పమ్మీ.
ఇదీ చూడండి:లాక్డౌన్లో మీ శరీరం స్పీడు తగ్గిందా?