జుట్టు చూడు ఎలా జీవం లేకుండా ఉందో.. కాస్త హెయిర్‌ప్యాక్ వేయొచ్చుగా? సమాధానం.. టైం లేదు! చర్మం చూడు పొడిబారిపోయి ఎలా ఉందో.. కాస్త కేర్ తీసుకోవచ్చుగా? సమాధానం.. టైం లేదు. ఇవే కాదు అందం, ఆరోగ్యం గురించి ఎవరేం చెప్పినా సమాధానం టైం లేదు అనే చెప్పాం. మరి ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది కదా! ఇక ఎందుకు ఆలస్యం ఈ జాగ్రత్తలు పాటించండి..
విటమిన్ డి సంగతేంటి?
మామూలుగానే మనకు విటమిన్-డి తక్కువగా ఉంటుంది. మరి బయటకు రావడానికి జంకుతున్న ఈ వేళ.. డి విటమిన్ ఎలా అందుతుంది? కాల్షియం, ఫాస్ఫరస్‌ను శరీరం గ్రహించడానికి విటమన్-డి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలు, దంతాల అభివృద్ధికి ఈ విటమిన్ ఎంత అవసరం. గుండె జబ్బులు, కుంగుబాటును తగ్గిస్తుంది. బరువు కూడా తగ్గిస్తుంది.
డి తగ్గితే వీటిని తీసుకోండి
చిన్నపనికే అలసిపోతూ ఉంటాం. కాస్త ఎక్కువ పనిపడితే ఒళ్లు, కండరాల నొప్పులు. నాలుగు మెట్లు ఎక్కితే అలసట. కింద కూర్చుని లేవడానికి కష్టపడుతుంటాం. ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. ప్రతిరోజూ మనకు 600 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్-డి అవసరం. ఈ విటమిన్-డి సూర్యరశ్మి నుంచి అందుతుంది. మనకిప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి... ఆహార పదార్థాల నుంచి తీసుకోవచ్చు. చేప, గుడ్డులోని పచ్చసొన, లివర్‌లో ఉంటుంది. ప్రస్తుతం పాలల్లో కూడా విటమిన్-డిని జతచేస్తున్నారు.
జుట్టు సంరక్షణ
చాలామందిలో జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం తరచూ చూస్తూ ఉంటాం. ఉద్యోగినులు మామూలు రోజుల్లో ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోలేరు. కానీ ఈ సమయంలో జుట్టుపై కాస్త శ్రద్ధ పెట్టొచ్చు.
* కొబ్బరినూనెలో గోరువెచ్చని ఆముదం కలిపి తలకు పట్టించాలి. రాత్రంతా ఉంచి మర్నాడు తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
సహజ సిద్ధమైన హెయిర్‌ప్యాక్‌లు..
* అరచెంచా గ్రీన్‌టీ పౌడర్‌లో చెంచా కొబ్బరినూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
* రెండు గుడ్ల తెల్లసొనకు కొన్ని చుక్కల ఆలివ్‌నూనె, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
* చెంచా కలబంద గుజ్జులో, కొద్దిగా బాదంనూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వీటితోపాటు జుట్టు పెరగడానికి మంచి ఆహారం ఎంతగానో తోడ్పడుతుంది. జింక్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఎ, సి, డి, ఈ... ఇవన్నీ సరిగ్గా తీసుకోవాలి.
విటమిన్ ఎ:క్యారెట్, పాలకూర, గుమ్మడికాయలు, చిలగడదుంపల్లో ఉంటుంది.
విటమిన్ బి:పొట్టు తీయని పప్పులు, మాంసం, ఆకుకూరల్లో లభిస్తుంది.
విటమిన్ సి:స్ట్రాబెర్రీ, నిమ్మకాయలు, క్యాప్సికమ్, జామకాయలు, మామిడిపండ్ల నుంచి అందుతుంది.
విటమిన్ డి:గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, పాలు, చేపలు