మూత్రంలో ప్రోటీన్ పోతూ (protein in urine) ఉంటే కిడ్నీలు పాడై పోయాయని అర్థమా? దాని వల్ల జరిగే పరిణామాలపై ఆందోళన చెందుతున్నారా? కిడ్నీ అనారోగ్యంగా ఉందని చెప్పడానికి చేయాల్సిన పరీక్షలేంటో చూద్దాం.
ప్రశ్న:మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది. దీనివల్ల ఏమైనా సమస్యలు ఏర్పడతాయా?
డాక్టర్ సమాధానం:మూత్రంలో ప్రోటీన్ పోవడమనేది కిడ్నీ పరంగా మంచిది కాదు. ఏదైనా ఒక అవయవం తాను బాగలేనని చెప్పడానికి కొన్ని సందర్భాలుంటాయి. మెదడు బాగలేనని చెప్పడానికి ఫిట్స్, గుండె అయితే.. గుండెలో దడ, ఊపిరితిత్తులు కష్టపడుతున్నప్పుడు ఆయాసం రూపంలో తెలుస్తుంది.
శరీరం లోపల ప్రశాంతంగా ముడుచుకుపోయి ఉన్న లివర్ గానీ, కిడ్నీ గానీ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రం సులువుగా తెలియదు. అందుకోసం రక్త, మూత్ర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. జాండిస్ వచ్చినప్పుడు లివర్ బాలేదని తెలుస్తుంది. అదే మూత్రంలో కొంచెం నురగ లాగా వచ్చి, ప్రోటీన్ పోతుంటే కిడ్నీ బాగాలేదని అర్థం. కిడ్నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి చాలా తక్కువ పరీక్షలు అవసరం అవుతాయి.