తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పండంటి పాపాయికి జన్మనివ్వాలంటే ఇవి తప్పనిసరి - ఆరోగ్య సూచనలు

తొమ్మిది నెలల ప్రయాణం సాఫీగా జరిగిపోవాలని... పండంటి పాపాయికి జన్మనివ్వాలని ఏ తల్లైనా కోరుకుంటుంది.. ఆ క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. అందులో ఒకటి రక్తహీనత. ఈ సమస్యకు కారణాలేంటి.. దీని బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు డాక్టర్‌ బాలాంబ..

Preventing Iron Deficiency Anemia During Pregnancy
గర్భిణీ రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే...?

By

Published : Jul 1, 2020, 11:14 AM IST

మ్మాయిల్లో నెలసరి మొదలయినప్పట్నుంచి... వారిలో రక్తహీనత ప్రారంభమవుతుంది. కారణం... ఓ వైపు రక్తం పోవడమే కానీ, వారు తీసుకునే ఆహారం నుంచి ఇనుము తగినంతగా అందకపోవడమే. అలా అమ్మాయిల్లో పెళ్లికి ముందు నుంచే రక్తహీనత మొదలవుతుంది. పెళ్లయిన తరువాత కూడా ఆహారంలో పెద్దగా మార్పులేం ఉండవు.పైగా పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆ సమయంలోనే గర్భం దాలుస్తారు. నిజానికి గర్భం దాల్చడానికి ముందు 12.5 గ్రామ్‌ పర్సంటేజ్‌ హిమోగ్లోబిన్‌ ఉండాలి. కానీ చాలామందిలో ఇలా ఉండటం లేదు. గర్భిణుల్లో రక్తహీనతకు అనేక కారణాలున్నా... సమతులాహారం తీసుకోకపోవడమే అతిపెద్ద కారణం.

గర్భిణికి ఎంత ఇనుము కావాలి?

కడుపులోని పాపాయికీ, శరీరంలోని ప్రతి కణానికి ఐరన్‌ అవసరం అవుతుంది. కడుపులో బిడ్డ ఎదగడానికీ, మాయకు కలిపి 350 మిల్లీగ్రాముల ఇనుము కావాలి. సాధారణంగా మహిళల్లో మూడున్నర లీటర్ల రక్తం ఉంటుంది. గర్భధారణ సమయంలో ఒకటిన్నర లీటర్లు పెరిగి మొత్తం అయిదు లీటర్లకు చేరుకుంటుంది.

ఇలా రక్తం పెరగడానికి మరో 450 మిల్లీగ్రాముల ఇనుము అదనంగా అవసరం అవుతుంది. ఈ క్రమంలో వీళ్లకు ఐరన్‌ మాత్రలు తప్పనిసరి. వీటిని తీసుకున్నప్పుడు కొందరిలో మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వాంతులు... లాంటి సమస్యలు కనిపించొచ్ఛు గర్భిణుల్లో మొదటి మూడు నెలల్లో హిమోగ్లోబిన్‌ 8.5 కంటే తక్కువ ఉంటే ఇంజెక్షన్లు తప్పనిసరి అవుతాయి.

సమతులాహారం అవసరం!

గర్భిణులకు ఐరన్‌తోపాటు మాంసకృత్తులుండే పోషకాహారాన్ని అందివ్వాలి. వీరి ఆహారంలో విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు ఉండేలా చూడాలి. మాంసాహారులైతే కోడి, గొర్రె, మేక మాంసం, గుడ్లు, పాలు, పాల పదార్థాలు తినొచ్ఛు

తక్కువయితే ఏమవుతుంది...

గర్భిణులు తొమ్మిది నెలల్లో నాలుగుసార్లు హిమోగ్లోబిన్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. మొదటి మూడు నెలల్లో హిమోగ్లోబిన్‌ తక్కువైతే బిడ్డ ఎదుగుదల సరిగా ఉండదు. కడుపులో బిడ్డ అవయవాలు రూపుదిద్దుకునే సమయం ఇది. ఈ సమయంలో రక్తం తక్కువగా ఉంటే పిండానికి సరిగా ఆక్సిజన్‌ అందక అవయవాల్లో లోపాలు ఏర్పడవచ్ఛు ఫలితంగా జన్యువుల్లో మార్పులొస్తాయి.

ఈ పరిస్థితులు పెద్దయ్యాక అనేక వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. తక్కువ బరువుతో పుట్టే బిడ్డకు మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌ లాంటివి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. మొదటి మూడు నెలల్లో... పరీక్ష చేయించడం వల్ల రక్తహీనత లోపం ఉన్నట్లు తెలిస్తే సమతుల ఆహారం, సప్లిమెంట్ల ద్వారా దాన్ని అధిగమించవచ్ఛు అయిదో నెలలో చేసే పరీక్షల వల్ల ఒకవేళ రక్తం తక్కువగా ఉంటే పెంచుకోవచ్ఛు 7-8 నెలల మధ్యలో చేసే టెస్ట్‌ వల్ల ప్రసవానికి రెండు నెలల సమయం ఉంటుంది కాబట్టి.. అప్పుడు కూడా హిమోగ్లోబిన్‌ పెంచేందుకు ప్రయత్నించవచ్ఛు తొమ్మిదో నెలలో... కాన్పు సమయానికి గర్భిణికి ఎంత రక్తహీనత ఉందో తెలుస్తుంది. దాంతో కావాల్సిన రక్తం ముందు జాగ్రత్తగానే సమీకరించుకునే అవకాశాలు ఉంటాయి. కాన్పు సమయానికి రక్తహీనత ఉంటే ప్రమాదం. ఎందుకంటే ఆ సమయంలో కొద్దిగా రక్తస్రావమైనా గర్భిణి షాక్‌లోకి వెళ్లొచ్ఛు దీన్ని పోస్ట్‌ పార్టమ్‌ హెమరేజ్‌ అంటారు. మాతృమరణాలకు ఇదొక పెద్ద కారణం. మనదేశంలో మాతృమరణాలకు 20 శాతం రక్తహీనతే కారణం.

ఎనీమియా లక్షణాలు

ఆకలి లేకపోవడం, పనిచేయలేకపోవడం, త్వరగా అలసిపోవడం, అరచేతులు పాలిపోయినట్లు ఉండటం, చర్మం, పెదాలు, గోళ్లు పొడారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

ఇవీ చూడండి: దిగంతిక సృష్టి: ఈ మాస్క్‌ కరోనా వైరస్‌ని చంపేస్తుందట!

ABOUT THE AUTHOR

...view details