Safety Measures for Good Health in Winter : చలికాలం.. వ్యాధులు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఆస్తమా.. న్యుమోనియా లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరిలో శరీరంపై ఎర్రటి పొక్కులు, పగుళ్లూ వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇవే లక్షణాలతో గడిచిన నెల రోజుల్లో 15-20 మంది పిల్లలు గాంధీలో చేరినట్లు వైద్యులు తెలిపారు. చికిత్సలతో అందరూ కోలుకున్నారన్నారు. ‘ఈ కాలంలో ప్రధానంగా శ్వాసకోశ వ్యాధులైన న్యుమోనియా, సీవోపీడీ, ఆస్తమా ఇబ్బంది పెడుతుంటాయి. సాధారణ చికిత్సలతోనే ఇవి తగ్గిపోతున్నాయని’ గాంధీలో చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ సుచిత్ర తెలిపారు. అయినా నిర్లక్ష్యం తగదని, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైరల్ ఎగ్జాంథిమాటోస్ కారణంగా పిల్లల్లో జ్వరం, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తుంటాయన్నారు.
ఇలాంటప్పుడు అప్రమత్తత అవసరం..
- కొన్ని రకాల అలర్జీలు, వైరస్ వల్ల పిల్లల్లో స్వల్ప జ్వరం, శరీరంపై ఎర్రటి పొక్కులు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. జ్వరం తగ్గకుండా కొనసాగుతున్నా.. శరీరంపై చీముతో కూడిన ఎర్రటి పొక్కులు ఉంటే అప్రమత్తం కావాలి. వైద్యుల సూచనలతో చికిత్స పొందాలి.
- డెంగీ జ్వరం వచ్చినప్పుడు శరీరంపై రాషెస్ వస్తుంటాయి. జ్వరం, కడుపులో నొప్పి, కళ్ల కింద నొప్పి, కండరాల నొప్పులతోపాటు శరీరంపై ఎర్రటి పొక్కులు ఉంటే వెంటనే
- అప్రమత్తం కావాలి. డెంగీ నిర్ధారణ అయితే వైద్యులను సంప్రదించాలి.
- పొక్కులను చిదమడం, గట్టిగా రుద్దడం చేయకూడదు. యాంటి హిస్ట్‌మిక్స్ మందులను రాస్తే దురద తగ్గుతుంది. కొబ్బరి నూనె రాసినా ఉపశమనం ఉంటుంది.
- చలికాలంలో పిల్లలు నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపించరు. నీరు, ద్రవాలు తగినంత తీసుకోవడం ద్వారా వైరల్ వ్యాధుల నుంచి త్వరితగతిన బయటపడవచ్చు. ఆకు కూరలు, సీజనల్ పండ్లు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.