తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Porn Addiction: ఆ వ్యసనం నుంచి విముక్తి ఎలా? - సెక్స్​

చాలా మంది పోర్న్​ అడిక్షన్​ గురించి మాట్లడటానికి సిగ్గుపడుతూ ఉంటారు. సరదాగా లేక ఒత్తిడిని జయించేందుకు మొదలు పెట్టి.. వారు పోర్న్​కు బానిసగా మారిపోతూ ఉంటారు. ఇవి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. వ్యసనం నుంచి విముక్తి పొందాలని ప్రయత్నించినా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోతారు. మరి దీనికి పరిష్కారమేంటి?

porn addiction
పోర్న్​ అడిక్షన్​

By

Published : Jul 13, 2021, 4:36 PM IST

'పోర్న్​ అడిక్షన్​..' ప్రపంచంలోని ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఇది. ఇతర వ్యసనాలు ఏమున్నా చెప్పుకోవచ్చు కానీ.. చాలా మంది పోర్న్​ అడిక్షన్​ సంగతిని బయటపెట్టేందుకు సిగ్గుపడుతూ ఉంటారు. ఈ వ్యసనం నుంచి విముక్తి పొందాలనుకుంటూనే.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోతారు. చివరకు ఎవరితోనూ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతారు.

మద్యం, డ్రగ్స్​లాగే.. పోర్న్​ అడిక్షన్​ను మానసిక వ్యాధిగా గుర్తించేందుకు అమెరికన్​ సైకలాజికల్​ అసోసియేషన్​(ఏపీఏ) నిరాకరించింది. అయినప్పటికీ మనిషి జీవితంలో ఇది సృష్టించే అనర్థాలు అన్నిఇన్నీ కావు!

ఏదైనా వ్యసనంతో ఎప్పటికైనా చిక్కులు తప్పువు. అశ్లీల వీడియోలు చూసే వ్యసనంతో ఇది ఎక్కువే. పరిస్థితి చేయి దాటిపోతుంది. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? పోర్న్​ అడిక్షన్​ నుంచి ఎలా బయటపడాలి?

కారణాలు..

ఓ మనిషి పోర్న్​కు బానిస ఎలా అవుతాడనేది చెప్పడం కష్టం. ఒంటరితనాన్ని, ఒత్తిడిని జయించడానికి పలువురు అశ్లీల వీడియోలు చూడటం మొదలుపెడతారు. మానసిక ఇబ్బందులు, జీవిత బంధాల్లో సమస్యలు, శృంగార సమయంలో ఎవరు ఎలా ఉంటారు? ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలి? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండటం కొన్ని కారణాలు. ఇంకొందరైతే సరదాగా చూడటం అలవాటు చేసుకుంటారు.

తొలినాళ్లలో ఆ ప్రపంచం అంతా అద్భుతంగానే ఉంటుంది. అదే అలవాటుగా మారిపోతుంది. పరిస్థితి తమ చేతుల్లోనే ఉంది అనుకుని భ్రమపడుతూ ఉంటారు. కానీ అప్పటికే అది రోజువారీ జీవితంలో ఓ భాగమైపోతుంది.

సంకేతాలు ఇవే..

  • అశ్లీల వీడియోలు చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోవడం. రిస్క్​ చేసి మరీ పని ప్రదేశాల్లో చూడటం.
  • శృంగార జీవితం అసంతృప్తిగా అనిపించడం.
  • పోర్న్​ చూస్తూ ఇతర బాధ్యతలను విస్మరించడం.
  • చూసినంత సేపు ఆనందిస్తూ.. ఆ తర్వాత సిగ్గుపడటం.
  • అశ్లీల వీడియోలు చూసేందుకు భారీగా ఖర్చుపెట్టడం.
  • బాధ, నిద్రలేమి, ఇతర మానసిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందేందుకు పోర్న్​ను ఓ మాధ్యమంగా వినియోగించుకోవడం.

పరిష్కారమేంటి?

పోర్న్​ అడిక్షన్​ నుంచి విముక్తి పొందేందుకు సరైన చికిత్స లేదు. కానీ సొంతంగా కొన్ని పాటిస్తే ఈ వ్యసనం నుంచి దూరంగా ఉండొచ్చు.

  • రిలేషన్​షిప్​ కౌన్సిలింగ్​: కౌన్సిలింగ్​ ద్వారా శృంగారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఫలితంగా సమస్యల గురించి చెప్పుకునే విధంగా భాగస్వామిపై నమ్మకం పెరుగుతుంది.
  • సైకోథెరపీ: మీలో పోర్న్​ అడిక్షన్​ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మానసిక ఇబ్బందిని అధిగమించేందుకు కృషి చేయాలి.
  • జీవనశైలిలో మార్పులు: ఒక్కోసారి.. మీ జీవనశైలి కూడా మీరు అశ్లీల వీడియోలు చూసే వ్యసనానికి కారణమయ్యే అవకాశముంది. చాలా ఖాళీగా ఉంటే పోర్న్​వైపు ఆలోచనలు మళ్లుతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు బిజీగా ఉండేట్టు చూసుకోవాలి. మీకు నచ్చిన పని చేస్తే ఇతర వాటిపై ఆలోచనలు ఉండవు.

'పోర్న్​ అడిక్షన్​'కు వయసుతో సంబంధం ఉండదు. జీవితాలపై తీవ్ర ప్రభావం కూడా పడుతుంది. అందువల్ల.. నిర్లక్ష్యం చేయకుండా సంకేతాలు కనిపించిన వెంటనే జాగ్రత్త పడితే మంచిది. అవసరమైతే వైద్యుల సహాయాన్ని కూడా తీసుకోవచ్చు.

ఇదీ చూడండి:-మర్మాంగాన్ని శుభ్రం చేసుకోకపోతే.. ప్రమాదమే!

ABOUT THE AUTHOR

...view details