Liver Problem RemediesIn Telugu : మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకవైపు వృత్తిరీత్యా ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు శారీరక శ్రమ తగ్గుతోంది.. దీంతో లేనిపోని రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అనేక మందిలో కాలేయ సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి. మరి దీనికి కారణం ఏమిటి? ఈ కాలేయ సమస్యల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాధి లక్షణాలు :ప్రస్తుత కాలంలోకాలేయ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. హెపటైటిస్- ఏ వ్యాధి బారినపడ్డవారిలో అస్వస్థత, జ్వరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, వికారం, కడుపులో మంట, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారటం కనిపిస్తాయి. ఇక హెపటైటిస్- బి లక్షణాలు మొదట్లో పెద్దగా ఉండవు కానీ కొందరిలో కళ్లు, చర్మం పచ్చగా మారటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు లాంటివి ఉంటాయి. దీని బారిన పడితే.. ప్రారంభ దశలో పెద్దగా మందుల అవసరం ఉండదు. ఆ సమయంలో ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే పోషకాహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు.
లివర్ జాగ్రత్త!
మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. మనం తీసుకునే ఆహారంలోని టాక్సిన్స్ వల్ల.. పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా నీటి ద్వారా హెపటైటిస్-ఏ, హెపటైటిస్- బి వస్తాయి. ఇది ప్రమాదకరం. రక్తం కలుషితం అవ్వడం, లేదా కలుషితమైన రక్తం ఎక్కించడం వల్ల, కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మన లైఫ్ స్టైల్ మారడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల లివర్‌లో కొవ్వు చేరి నాష్ అనే జబ్బు వస్తుంది. దీని వల్ల లివర్ సాధారణ ప్రక్రియ దెబ్బతింటుంది.
మత్తు పదార్థాలు తీసుకోవద్దు!
అతిగాఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా లివర్ చెడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మితిమీరి మందు తాగడం వల్ల లివర్ టాక్సిన్‌గా మారుతుంది. ఇది ఇలాగే కొనసాగితే.. లివర్ సిరాటిక్ స్థాయికి వెళుతుంది. ఒక్కసారి ఆ స్థాయికి చేరితే.. లివర్ డ్యామేజ్‌ని మనం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. వాస్తవానికి హెపటైటిస్-సి తొలి దశలోనూ పెద్దగా లక్షణాలు ఉండవు. హెపటైటిస్- బి మాదిరిగానే ఉంటాయి. కానీ ఇది కొందరిలో దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. కొందరిలో అయిదేళ్లలోనే ఇది ప్రారంభం కావచ్చు.