తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఉపవాసంతో ఉత్తమ ఆరోగ్యం మీ సొంతం! - etv bahrat health

ఉపవాసం కొన్ని వందల ఏళ్లుగా భారతీయుల సంస్కృతిలో భాగమే. అయినా ఆచారాల కోసం తిండి మానేయడమేంటని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. కానీ, ఉపవాసం దేవుడి కోసమో, పద్ధతుల కోసమో కాదు.. ఆరోగ్యం కోసమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Is Fasting Good For Health?
ఉపవాసంతో ఉత్తమ ఆరోగ్యం మీ సొంతం!

By

Published : Aug 19, 2020, 10:30 AM IST

మనం ఒక రోజులో తినే ఆహారం జీర్ణవ్యవస్థలోకి వెళ్లాక.. జీర్ణక్రియ పూర్తి కావడానికి కనీసం 12 నుంచి 18 గంటల సమయం పడుతుంది. కానీ, మనం ఆ ప్రక్రియ పూర్తి కాకముందే మరో రౌండు భోజనం పూర్తి చేసేస్తాం. దీంతో, జీర్ణ వ్యవస్థ విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది. మరి, కనీసం వారానికోసారైనా మన శరీర అంతర్భాగాలకు సెలవిస్తే అవి మరింత చురుగ్గా పని చేస్తాయి కదా...! అందుకే, ఉపవాసం చేయడం ఉత్తమమైన మార్గమంటున్నారు తిరుపతి, టీటీడీ ఎస్.వీ ఆయుర్వేదిక్ కళాశాల ప్రొఫెసర్, డాక్టర్ బులుసు సీతారాం.

ఉపవాసాలు రెండు రకాలు.. ఓ రోజంతా పూర్తిగా తినకుండా ఉండే సాధారణ ఉపవాసం. మరొకటి రోజులో కొంత భాగం తిని ఇంకొంత భాగం ఏమీ తినకుండా ఉండే ఇంటర్మిటెన్ ఫాస్టింగ్.

సాధారణ ఉపవాసం వర్సెస్ ఇంటర్మిటెన్ ఉపవాసం

రోజూ తీసుకునే ఆహారాలను పూర్తిగా మానేయడమే ఉపవాసం. ఆహారమంటే పచ్చి మంచి నీరు, పండ్ల రసాలు, మజ్జిగా మొదలైనవి కూడా మానేయాలి. కానీ, ఇలా రోజంతా ఏమి తినకపోతే కళ్లు తిరిగి పడిపోయే అవకాశం ఉంది. అందుకే.. ఇంటర్మిటెన్ ఉపవాసం చేయొచ్చు.

ఇంటర్మిటెన్ ఫాస్టింగ్ ఎన్నో విధాలుగా చేయొచ్చు. ఉదాహరణకు

  • ప్రతి రోజూ ఉదయం సాదాసీదా ఆహారం తీసుకుని.. మరింత సాదా సీదా ఆహారం మధ్యానం తిని.. రాత్రి అసలు తినకుండా ఉండడం ఒక పద్ధతి.
  • వారినికి ఒకటి రెండు సార్లు ఘన పదార్థాలు పూర్తిగా మానేయండం మరో పద్ధతి.

ఉపవాసంతో ఉత్తమ ఆరోగ్యం...

ఉపవాసం శరీరాన్ని తేలికపరుస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి ఆరోగ్యాన్ని అందిస్తుందంటున్నారు డా. సీతారాం.

  • బరువు తగ్గుతారు...

తరచూ ఉపవాసాలుంటే.. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ తర్వాత మరింత ఉత్తేజంగా జీర్ణక్రియ జరుగుతుంది. ఆహారం దొరకనప్పుడు శరీరం.. పేరుకుపోయిన కొవ్వును కరిగించి శక్తినిచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అంతే కాదు, గుండె ఇతర అవయావాలపై ఒత్తిడి తగ్గుతుంది.

  • దీర్ఘాయువు

ఉపవాసం వల్ల శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీ వంటి ముఖ్య అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి, తరచూ ఉపవాసం ఉండడం వల్ల ఆ అవయవాలు ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం ఉంటుంది. తద్వారా దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది.

  • వ్యర్థాలను తొలగిస్తుంది..

మన శరీరంలో ఎప్పటి నుంచో నిల్వ ఉన్న సోడియం, జీర్ణం కాని ఇతర లోహాలు ఈ ఉపవాస సమయంలో కరిగిపోతాయి.

  • జ్ఞాపక శక్తి పెరుగుతుంది...

ఉపవాసంతో జ్ఞాపక శక్తి పెరుగుతుందంటున్నారు వైద్యులు. సమయానుకూలంగా ఉపవాసాలు ఉండడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.

అతి అనర్థం..

అతిగా చేస్తే ఏదైనా అనర్థమే. అలాగే మితిమీరిన ఉపవాసాలు చేస్తే నష్టాలు కూడా ఉన్నాయి... అవేంటంటే..

  • కిడ్నీపై ప్రభావం...

అనవసరమైన సమయాల్లో.. అదే పనిగా ఉపవాసం చేస్తే శరీరంలో ఉన్న వ్యర్థాలతో పాటు శక్తినిచ్చే ప్రోటీన్లు కరిగిపోతాయి. దీంతో కిడ్నీ పనితీరు నెమ్మదిస్తుంది. ఇదే పునరావృతం అయితే, కిడ్నీపై తీవ్ర ప్రభావమే పడే అవకాశముంది.

  • క్లోమం గ్రంథి దెబ్బతింటే...

ఉపవాసం మంచిదే కదా అని అసలు ఆహారం తీసుకోవడమే మానేస్తే.. క్లోమ గ్రంథి దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అంతే కాదు, శరీరంలో షుగర్ శాతాన్ని పెంచుతుంది. దీర్ఘకాలిక మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది.

  • కొవ్వులే లేకుండా చేస్తుంది..

శరీరం సక్రమంగా పనిచేయాలంటే.. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎంతో అవసరం. అతి ఉపవాసాలతో వృథా కొవ్వులతో పాటు మంచి కొవ్వులనూ కరిగించేస్తే.. శక్తి ఎలా లభిస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోతుంది. మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జుట్టు రాలడం, మతిమరుపు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.

అందుకే 24 గంటల కంటే ఎక్కువ ఉపవాసం ఉండకుండా చూసుకోవాలి. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉపవాసం చేసేముందు ఓ సారి వైద్యులను సంప్రందిచాలని సూచిస్తున్నారు డా. సీతారాం.

ఇదీ చదవండి: ఈ ఆయుర్వేద డ్రింక్​తో కరోనాకు చెక్!

ABOUT THE AUTHOR

...view details