తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా?.. వీటిని అస్సలు తినకండి! - How To Reduce Bad Fat

How To Reduce Bad Fat : సరైన జీవనశైలి లేకపోవడం వల్ల చాలా మంది కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. బలమైన ఆహారానికి బదులు ఆరోగ్యానికి నష్టం చేసే ఫాస్ట్ ఫుడ్​ లాంటివి తీసుకోవడం వల్ల అనేక రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి జీవనశైలి వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువవుతోంది. మన శరీరానికి హాని చేసే అంశాల్లో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండె సంబంధిత జబ్బులు అధికమవుతాయి. ఇది హార్ట్ స్ట్రోక్​కు దారితీసే ప్రమాదమూ ఉంది. ఈ నేపథ్యంలో అధిక కొలెస్ట్రాల్​ను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Lower Your Bad Cholesterol Or Fats In Body
అధిక కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

By

Published : May 25, 2023, 6:57 AM IST

How To Reduce Bad Fat : కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, సిగరెట్లు, ఆల్కహాల్ అలవాట్లు లాంటివి శరీరంలో కొలెస్ట్రాల్​ శాతాన్ని అమాంతం పెంచేస్తాయి. ఆరోగ్యానికి చేటు చేసే అధిక కొలెస్ట్రాల్​ను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్​ను పెంచుకునే అవకాశం ఉంది. అయితే దీని కోసం కొన్ని రకాల మందులను కూడా వాడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బేకరీ ఐటమ్స్​ను తగ్గించండి!
శరీరంలో చెడు కొవ్వులను తగ్గించి మంచి కొవ్వులను పెంచుకోవాలంటే ట్రాన్స్​బాట్ అనే కొలెస్ట్రాల్​ను ఆహారంలో తీసుకోవడం మంచిది కాదు. కేకులు, బిస్కెట్లు, పిజ్జాలు లాంటి ఆహారాల్లో ట్రాన్స్​బాట్ అధికంగా ఉంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండటం మేలు. అంతేకాకుండా కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవాలంటే బరువు తగ్గించుకోవడం మరొక మంచి మార్గంగా చెప్పొచ్చు. అయితే ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా బరువు తగ్గడం మంచిది.

"కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుండెపోటు, పక్షవాతం లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవడం మంచిది. దీని కోసం భోజనంలో కొన్ని నియమాలు పాటించాలి. వనస్పతి, డాల్డా లాంటివి అస్సలు వాడకూడదు. అలాగే వాడిన నూనెను మళ్లీ వినియోగించొద్దు. నూనెతో తయారు చేసే బజ్జీలు, బోండాలు, వడలు, సమోసాలు వంటి స్నాక్స్ ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చెడు చేస్తాయని గుర్తుంచుకోవాలి. పిజ్జాలు, బర్గర్​లు, కేక్స్ లాంటి బేకరీ ఐటమ్స్​, డీప్​ ఫ్రై వస్తువులు కూడా తినడం శరీరానికి అస్సలు మంచిది కాదు. ఇలాంటివి ఎక్కువగా తినడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వంటి వాటికి దారి తీస్తుంది" అని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్​. బాలాజీ సూచిస్తున్నారు.

చిరుతిళ్లకు దూరంగా ఉండండి!
How To Reduce Bad Cholesterol By Food : పీచు పదార్థం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్​ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆహారంలో పీచును ఎక్కువగా తీసుకుంటే పొట్ట నిండుగా అనిపించి చిరుతిండి తినడం కూడా తగ్గుతుంది. ఒకేసారి పీచును అధిక మొత్తంలో తీసుకుంటే పొట్టలో నొప్పి, ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తగిన మోతాదులో తింటే మంచిది.

శరీరానికి మేలు చేసే మాంసాకృతులు తినండి!
ఆహారంలో చేపలు ఎక్కువగా తినడం వల్ల ఒమేగా-3 అనే ఫ్యాటీ ఆసిడ్ల ద్వారా గుండెకు మేలు చేసే కొవ్వులను పొందొచ్చు. వంటలకు ఆలివ్ ఆయిల్​ను వాడటం ద్వారా చెడు కొవ్వులను తగ్గించుకోవచ్చు. కొవ్వు ఎక్కువగా ఉండే మేక మాంసం లాంటివి కాకుండా చికెన్​ను తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మనం తినే బలమైన ఆహారంలో గుడ్లు కూడా తినొచ్చని అయితే వాటిని పచ్చసోనా లేకుండా తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

యోగా, ధ్యానం తప్పనిసరి..
చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్​ను పెంచడంలో వ్యాయామం చేయడం చక్కగా పనిచేస్తుంది. వారానికి రెండున్నర గంటల పాటు వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదే తరహాలో శరీరానికి హాని చేసే ట్రైగ్లైసెరైడ్స్ తగ్గుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. తరచూ వ్యాయామం చేయడం.. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటి అంశాలు కూడా కొలెస్ట్రాల్​ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఎంతో దోహదం చేస్తాయి.

పండ్లు, కూరగాయలతో పాటు కీరదోసకాయ, క్యారెట్ లాంటి సలాడ్స్​లు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్​ను పెంచడంలో డ్రైఫ్రూట్స్​, నట్స్​ కూడా మంచిగా పనిచేస్తాయి. అయితే నట్స్​లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని శరీరానికి కావల్సిన మోతాదులో తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవాలంటే ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా, మెడిటేషన్​(ధ్యానం)​ వంటి వాటిని సాధన చేస్తూ నచ్చిన అభిరుచులకు తగిన సమయం కేటాయించాలి.

చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తే ఎన్నో ఆరోగ్య లాభాలు.. కానీ వీటికి దూరంగా ఉంటేనే..!

ABOUT THE AUTHOR

...view details