విటమిన్ డి.. చిన్నప్పటి నుంచి దీని గురించి ఎన్నో విశేషాలు, వివరాలు తెలుసుకునే ఉంటాం. మనిషి ఆరోగ్యం దీనిపై ఆధారపడిన తీరు అలాంటిది. సూర్యరశ్మి తాకితే విటమిన్ డి పెరుగుతుందన్నది తెలిసిన విషయమే. అయితే.. సూర్యరశ్మి ఎంత సేపు మనిషిని తాకితే.. సరిపడా విటమిన్ డి శరీరంలోకి చేరుతుంది?
ఎంత సేపు?
తగిన మోతాదులో డి విటమిన్ లభించాలంటే వారంలో రెండు నుంచి మూడు గంటలైనా శరీరానికి ఎండ తగలాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ 30 నిమిషాల పాటు ఎండలో ఉంటే చర్మం.. వెయ్యి యూనిట్ల డి విటమిన్ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.
అంతేకాకుండా.. రోజుకు కనీసం 10 నిమిషాలైనా ఎండలో గడపాల్సిన అవసరం ఉంది.
డి విటమిన్ పుట్టగొడుగులు, చేప, పాలు, గుడ్లలో కూడా లభిస్తుంది. ఈ డి విటమిన్.. కాల్షియమ్ మెటబాలిజమ్ వృద్ధికి మాత్రమే కాక.. మెదడులో ఉండే సెరోటొనిన్ అనే రసాయనం పనితీరునూ మెరుగుపరుస్తుంది. దీని ద్వారా ఒత్తిడి తగ్గడం సహా మనసు ఉల్లాసంగా ఉంటుంది.
విటమిన్ డి లోపంతో..
ఈ విటమిన్ లోపం వల్ల లివర్, కిడ్నీ సమస్యలతో పాటు కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు ఔట్డోర్ కన్నా ఇండోర్లో పని చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీని వల్ల సూర్యరశ్మి సరిగ్గా తాకకపోవడం, ఇతర కారణాల వల్ల అనేకమంది ఈ విటమిన్ లోపంతో సతమతమవుతున్నారు. జాగ్రత్తలు తీసుకుని శరీరానికి తగిన విటమిన్ డిని అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అదే సమయంలో.. ఎక్కువగా ఎండలో గడపడం వల్ల డి విటమిన్ సహా రోగనిరోధక శక్తి పెరిగినా.. చర్మం రంగుపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:-సరిగ్గా నిద్రపట్టడం లేదా.. అయితే ఇది ట్రై చేయాల్సిందే!