How Much Should We Walk Daily? :నిజానికి నడక అనేది ఒక గొప్ప వ్యాయామం. ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అందుకే డాక్టర్లు కూడా రోజూ కాసేపు నడవండి అనే మాట తరచూ చెబుతుంటారు. కానీ, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ మంది సమయం లేదనో, బద్ధకంతోనో రోజూ కొంత సమయం కూడా నడవట్లేదు. ఆ.. నడిస్తే ఎంత? నడవకపోతే ఎంత? అని నిర్లక్ష్యంగా వ్యవహరించేవారూ ఉన్నారు. ఇక కొందరు నడిచినా రోజులో ఎంత నడవాలో తెలియక కాసేపు అలా వాకింగ్(Walking) చేసి ఇలా వచ్చేస్తుంటారు. దాంతో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. అయితే మీరు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించాలంటే మీ వయసు ప్రకారం.. రోజూ నడవాల్సిన దానికి ఓ లెక్క ఉంది. అలా నడిచినప్పుడే మీరు ఫిట్‌గా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఏ వయసు వారు ఎంత సేపు నడవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ ప్రతి వ్యక్తి కనీసం 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించాలి. ఇలా నడిచినప్పుడు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా మీ బాడీ గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, ఊబకాయం, రొమ్ము క్యాన్సర్, ఇతర జీవనశైలి సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని సంపాదించుకుంటుంది. అయితే మీరు 4,000 నుంచి 5,000 రోజువారీ నడిచినా ఆరోగ్యానికి దోహదం చేస్తుందని కొన్ని అధ్యయనాలు ప్రతిపాదించాయి. అయినప్పటికీ, మీరు రోజూ 10,000 మైలురాయిని చేరుకోవడానికే ప్రయత్నించాలి. ఇలా నడవడం ద్వారా మీకు ఎలాంటి హాని లేకపోగా.. ఆరోగ్య ప్రయోజనాలే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
ఇలా నడిస్తే నష్టాలే! వాకింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
పిల్లల విషయానికి వస్తే..వారు రోజూ కనీసం ఒకటిన్నర గంటల పాటు క్రమం తప్పకుండా ఆటలు, జంపింగ్ లాంటి కార్యకలాపాలలో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఈ ప్రక్రియ పిల్లల శరీరాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తుంది.