పట్టు లాంటి జుట్టు కోసం.. ఇంట్లోనే ఈ నూనెను తయారు చేసుకోండి! - here is how you can make healthy herba hair oil at home
నల్లగా నిగనిగలాడే ఒత్తైన కురుల కోసం రకరకాల నూనెలు వాడుతుంటాం. అందుకు తగ్గట్టే వీటిలోని ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. నిర్జీవమైన జుట్టు కోల్పోయిన లిపిడ్స్‌ను భర్తీ చేసి మళ్లీ పట్టులా మెరిసేలా సహకరిస్తాయి. శిరోజాలు మృదుత్వాన్ని సంతరించుకోవడంలో సహకరిస్తాయి. ఈ కారణంగానే ఆరోగ్యకరమైన కేశ సంపదను సొంతం చేసుకోవాలంటే తలకు నూనె పట్టించాల్సిందేనని సౌందర్య నిపుణులు కూడా చెబుతుంటారు.
here is how you can make healthy herba hair oil at home
By
Published : Apr 23, 2021, 3:05 PM IST
కొబ్బరి, ఆలివ్, నువ్వుల నూనె, ఆముదం, బాదం... అంటూ వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ మార్కెట్లలో లభ్యమవుతుంటాయి. అయితే ఇలా బోలెడు డబ్బు పెట్టి హెయిర్ ఆయిల్స్‌ను కొనే బదులు ఇంట్లోనే సహజసిద్ధంగా తయారుచేసుకోవడం ఎంతో మేలంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ తల్లి రేఖా దివేకర్. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలతో పాటు ఎన్నో రుచికరమైన, పోషక విలువలతో కూడిన వంటకాలను షేర్ చేసుకుంటున్న ఆమె తాజాగా శిరోజాల ఆరోగ్యానికి సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొబ్బరి నూనెతో పాటు ఇంట్లోనే సులభంగా లభించే మరికొన్ని పదార్థాలతో హెర్బల్ ఆయిల్‌ను తయారుచేయడమెలాగో దీని ద్వారా పంచుకున్నారు.
కోకొనట్ హెర్బల్ హెయిర్ ఆయిల్
కావాల్సిన పదార్థాలు
మందార పూలు -20
వేపాకులు -30
కరివేపాకు -30 రెబ్బలు
ఉల్లిపాయలు (చిన్నవి)-5
మెంతులు- ఒక టీ స్పూన్
కలబంద -ఒకటి
మల్లె పువ్వులు- 15 నుంచి 20
కొబ్బరి నూనె- ఒక లీటరు
తయారీ
మెంతులను ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. కలబందను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత పైన చెప్పిన అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లాగా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని లీటరు కొబ్బరి నూనెలోకి కలపాలి. దీనిని ఒక 45 నిమిషాల పాటు మీడియం సైజు మంటపై మరిగిస్తే ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఆపై చల్లార్చి ఒక గాజు సీసాలోకి వడపోసి భద్రపరచుకోవాలి.
ప్రయోజనాలివే!
హెయిర్ ఆయిల్ తయారీతో పాటు దీనిని తలకు పట్టించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో కూడా తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు రేఖ. ‘ఈ ఆయిల్‌ను జుట్టుకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. వారంలో కనీసం రెండు సార్లయినా ఇలా చేస్తే మనం కోరుకున్న కాంతివంతమైన జుట్టు సొంతమవుతుంది. ఇందులో ఉపయోగించిన మందార పూలు, కరివేపాకు, ఉల్లిపాయ శిరోజాల కుదుళ్లను బలంగా మారుస్తాయి. జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా సహకరిస్తాయి. వేపాకులు చుండ్రు సమస్యతో పాటు పేలను నివారిస్తాయి. కలబంద వెంట్రుకలను పొడవుగా పెరిగేలా చేసి మెరుపుదనాన్ని అందిస్తుంది. కురుల ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు మెంతుల్లో మెండుగా ఉంటాయి. నూనెకు చక్కని పరిమళాన్ని అందచేయడంలో మల్లెపూలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటి వల్లే ఈ నూనెను తయారుచేసేటప్పుడు మా ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. ఇక నూనెను వడపోసిన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని బాడీ స్ర్కబ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు’ అని రాసుకొచ్చారు రేఖ.
కేశాల ఎదుగుదలకు ఉపకరించే ఈ హెర్బల్ ఆయిల్ తయారీ గురించి తెలుసుకున్నారుగా.. మరి మీరూ ఈ నూనెను ట్రై చేయండి. ఒత్తైన శిరోజాలను సొంతం చేసుకోండి.