Lifestyle Diseases: ఆరోగ్యం అనగానే ఎక్కడలేని సందేహాలు పుట్టుకొస్తాయి. మధుమేహులు మందులు వేసుకోవాల్సిందేనా? ఆహార, వ్యాయామ నియమాలతో గ్లూకోజు అదుపులో ఉండదా? గుండెజబ్బులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఎలా చూసుకోవాలి? మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటే వ్యాయామాలు చేయటమెలా? పనుల ఒత్తిడిని తగ్గించుకోవటమెలా? ఇటీవల జీవనశైలి జబ్బులపై సుఖీభవ నిర్వహించిన వెబినార్‌లో వీక్షకులు ఇలాంటి సందేహాలనే సంధించారు. వీటికి నిపుణులు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. వాటిల్లో కొన్ని ఇవీ..
ఛాతీ బిగుతుగా ఉంది. ఏం చేయాలంటారు?
ఛాతీ బిగుతు, నొప్పి అనేక కారణాలతో రావొచ్చు. గుండెజబ్బు, జీర్ణాశయంలోని రసాలు అన్నవాహికలోకి ఎగదన్నుకొని రావటం, ఊపిరితిత్తుల్లో ద్రవాలు పోగుపడటం.. కండరాలు, ఎముకల సమస్యలు.. ఇలాంటివేవైనా వీటికి దోహదం చేయొచ్చు. అందువల్ల కారణాన్ని గుర్తించటం ముఖ్యం. ఛాతీలో నొప్పి తీరును బట్టి కొంతవరకు కారణాలను అంచనా వేయొచ్చు. నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, ఏవైనా పనులు చేసినప్పుడు, వ్యాయామాలు చేసినప్పుడు ఛాతీలో నొప్పిగా, బరువుగా అనిపించటం.. ఆయా పనులు మానేసినప్పుడు తగ్గుతుంటే గుండెజబ్బుకు సంబంధించిన నొప్పి అయ్యిండొచ్చు. పనులతో సంబంధం లేకుండా రోజంతా నొప్పి వస్తుంటే ఎముకలకు, కండరాలకు సంబంధించిన సమస్య కావొచ్చు. తిన్న తర్వాత నొప్పి వస్తే జీర్ణకోశ సమస్యతో ముడిపడి ఉండొచ్చు. గట్టిగా ఊపిరి తీసుకున్నప్పుడు నొప్పి వచ్చి, ఊపిరి వదిలినప్పుడు నొప్పి తగ్గుతుంటే ఊపిరితిత్తుల సమస్య కారణమై ఉండొచ్చు. ఏదేమైనా అంతకుముందు నొప్పి లేకుండా ఇప్పుడే మొదలైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవటం మంచిది. గుండె నొప్పిగా అనుమానిస్తే ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేస్తారు. అవసరమైతే ట్రెడ్‌మిల్ పరీక్ష కూడా చేస్తారు. వీటితో చాలావరకు గుండె నొప్పా? కాదా? అన్నది బయటపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏం చేయాలి?
అస్తవ్యస్త జీవనశైలిని మార్చుకొని గాడిలో పెట్టుకోవాలి. వేళకు భోజనం చేయాలి. వేళకు పడుకోవాలి. సమతులాహారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటమూ ముఖ్యమే. చాలామంది దీన్ని తగ్గించుకునే విషయంలో పొరపాటు పడుతుంటారు. నిజానికి చిన్న చిన్న జాగ్రత్తలతో దీన్ని తగ్గించుకోవచ్చు. వీటిల్లో ఒకటి సమయ పాలన. ఏదైనా పనిని కాస్త ముందుగానే ఆరంభించటం అలవాటు చేసుకుంటే చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది. ఒకేసారి ఎక్కువ పనులు ముందేసుకోకుండా ఒకటి పూర్తి చేశాక, మరోటి మొదలు పెట్టినా మేలే. అన్ని పనులూ మనమే చేయాల్సిన అవసరముండకపోవచ్చు. కొన్నింటిని ఇతరులకు అప్పగించే అవకాశముండొచ్చు. ఇలాంటి వాటిని గుర్తించి ఆయా వ్యక్తులకు అప్పగిస్తే ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది మనం చేయగలిగిన పనులేంటి? చేయలేనివేంటి? అనేది గుర్తించటం. మన సామర్థ్యాన్ని గుర్తించగలిగితే ‘అయ్యో అది చేయలేకపోయామే, ఇది చేయలేకపోయామే’ అని బాధపడటం తగ్గుతుంది. బలమైన, ఆరోగ్యకరమైన కుటుంబ, సామాజిక సంబంధాలు కూడా ముఖ్యమే. ఇవి మానసికంగా మంచి దన్నుగా నిలుస్తాయి. ఇలాంటి జాగ్రత్తలతో గుండెజబ్బులను చాలావరకు నివారించుకోవచ్చు.
నా భార్యకు పరగడుపున గ్లూకోజు 124 ఉంది. భోజనం చేశాక 235. మందులు ఇంకా మొదలు పెట్టలేదు? ఏం చెయ్యాలి?
మధుమేహం నిర్ధరణ, చికిత్సలో రక్తంలో గ్లూకోజు మోతాదులే కీలకం. ఎవరికైనా పరగడుపున ఉదయం ఏడు గంటలకు రక్తంలో గ్లూకోజు 125 మి.గ్రా. దాటినా లేదా భోజనం చేశాక రెండు గంటల తర్వాత 200 మి.గ్రా. మించినా తొలి రోజు నుంచే మందులు వేసుకోవటం ఆరంభించాలి. ఇప్పుడు పరీక్ష చేయించారు కాబట్టి గ్లూకోజు ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది. ఇలా ఎంతకాలం నుంచి ఉందనేది తెలియదు. చాలామంది ‘ఇప్పుడే కదా మధుమేహం బయటపడింది. మరో నెల ఆగుదాం. ఆహార, వ్యాయామ నియమాలు పాటిద్దాం. తర్వాత మందులు వేసుకుందాం’ అని అనుకుంటారు. ఒకప్పుడు డాక్టర్లు కూడా మూడు నెలల పాటు ‘పొగ మానెయ్యండి, రోజూ వ్యాయామం చేయండి, ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించుకోండి’ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు రక్తంలో గ్లూకోజు నిర్ణీత మోతాదుల కన్నా ఎక్కువగా ఉన్నట్టు బయటపడిన రోజు నుంచే మందులు వేసుకోవాలని చెబుతున్నాం. మధుమేహం మొదలై అప్పటికే చాలాకాలం అయినట్టయితే దుష్ప్రభావాలూ ఆరంభమై ఉండొచ్చు. మందులు ఆలస్యమైతే ఇవి తీవ్రమయ్యే ప్రమాదముందని తెలుసుకోవాలి.
చాలా ఏళ్లుగా మధుమేహం ఉంది. అరికాలు మంటలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకోసారి పాదాలకు పట్టు కూడా ఉండటం లేదు. చెప్పులు కూడా సరిగా వేసుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి?
మధుమేహం వచ్చి, పదేళ్లు దాటిన తర్వాత ఏదో ఒకరకమైన నాడీ సమస్య (న్యూరోపతీ) తలెత్తుతుంటుంది. వీటిల్లో ప్రధానమైనవి పాదాల్లో స్పర్శ తగ్గటం (సెన్సరీ).. తిమ్మిర్లు, సూదులు పొడిచినట్టు అనిపించటం (పారస్తీషియా). కొందరికి కదలికలకు తోడ్పడే నాడులూ ప్రభావితం కావొచ్చు. దీంతో కాళ్లలో గానీ వేళ్లలో గానీ బలహీనత ఏర్పడుతుంది. పాదాలకు పట్టు ఉండటం లేదంటున్నారంటే స్పర్శ, కదలికలకు తోడ్పడే నాడులు రెండూ దెబ్బతిన్నాయనే అనిపిస్తోంది. మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ రక్తంలో గ్లూకోజు మోతాదులు 125 మి.గ్రా. కన్నా మించకుండా, భోజనం తర్వాత 200 మి.గ్రా. దాటకుండా చూసుకోవాలి. మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్షలో 7% లోపే ఉంచుకోవాలి. ఇలా మూడు నెలల పాటు గ్లూకోజును అదుపులో ఉంచుకుంటే నాడీ సమస్యల ఇబ్బందులు తగ్గే అవకాశముంది. తిమ్మిర్లు, మంటలు తగ్గటానికి ప్రిగాబాలిన్, మిథైల్ కొబాలమిన్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల సలహా మేరకు తీసుకోవాలి. వీటిని వేసుకున్నా కూడా గ్లూకోజును కచ్చితంగా అదుపులో ఉంచుకుంటే తప్ప కాళ్లలో నాడీ సమస్యలు తగ్గవనే సంగతిని గుర్తించాలి.
మందులు వాడుకోకుండా షుగర్ జబ్బును అదుపులో ఉంచుకోవచ్చా?
చాలామంది ఇదే మాట అడుగుతుంటారు. ఆహారంలో మార్పులు చేసుకోవటం.. వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేయటం.. మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం వంటి జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చనే ధీమా అందరిలోనూ ఉంటుంది. ఈ ఆలోచన మంచిదే గానీ దాదాపు 60-70% మందిలో ఇది సాధ్యం కాదు. మందుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మందులతోనే గ్లూకోజు అదుపులోకి వస్తుంది. ఒకవేళ గ్లూకోజు పెరుగుతున్నట్టయితే దానికి తగినట్టుగా మందుల మోతాదులనూ మార్చుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరమూ ఏర్పడుతుంది. వీటిని కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల వంటి సాంక్రమికేతర జబ్బులకు సుమారు 70% వరకు గాలి కాలుష్యం కారణమవుతున్నట్టు ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒక్క గాలి కాలుష్యమే కాదు, మనకు తెలియని కాలుష్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల అనర్థాల గురించి మనకు అంతగా అవగాహన లేదు. కానీ ప్లాస్టిక్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు పుట్టిన పిల్లలకు థైరాయిడ్ గ్రంథి వాపు, మధుమేహం ముప్పు ఎక్కువగా వస్తున్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. కాబట్టి కాలుష్యం మీదా దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది.