ప్రకృతితో జీవనం.. ఆనందం, ఆరోగ్యదాయకం. ఖాళీ సమయాల్లో మొక్కలకు నీళ్లు పోయటం, పెరట్లో పని చేయడం వంటివి చేస్తుంటారు చాలా మంది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నందున మొక్కలతో గడిపేందుకు మరింత సమయం దక్కింది. అయితే అసలు పెరటి తోటల పెంపకం వల్ల ప్రయోజనలేంటో తెలుసుకుందామా?
పెరటి తోటల పెంపకంతో ఒనగూడే ప్రయోజనాల్లో ముఖ్యమైనది ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు సొంతం కావటం. ఇష్టపడి, కష్టపడి పెంచుకున్న కూరగాయలు, పండ్లు. పైగా మరింత రుచిగానూ ఉంటాయాయె. అందువల్ల పీచు, ఖనిజాలు, విటమిన్లతో నిండిన పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం అలవాటవుతుంది. దీంతో పక్షవాతం, గుండెజబ్బులతో పాటు కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుంది.
పిల్లలనూ భాగస్వాముల్ని చేయాలి
పేగుల కదలికలు మెరుగుపడటం వల్ల మలబద్ధకమూ దరిజేరదు. కొవ్వు పదార్థాలు, ఎక్కువ కేలరీలను ఇచ్చే వాటికి బదులు పండ్లు, కూరగాయలను తీసుకుంటే బరువు తగ్గటానికీ తోడ్పడుతుంది. తోటల పెంపకంలో పిల్లలనూ పాలు పంచుకునేలా చేస్తే వారిలోనూ మంచి ఆహార అలవాట్లు పెంపొందుతాయి. రోజుకు 2,000 కేలరీలు తీసుకునేవారు విధిగా 2.5 కప్పుల కూరగాయలు, 2 కప్పుల పండ్లు తీసుకోవాలన్నది నిపుణుల సూచన. కానీ మనలో చాలామంది దీని కన్నా చాలా తక్కువగానే తింటున్నారు.
ఎన్నో లాభాలు
పెరట్లో పండించటం ద్వారా కూరగాయలు, పండ్ల వినియోగం పెరుగుతుందనటంలో సందేహం లేదు. సహజమైన వాతావరణాల్లో శారీరక శ్రమ చేస్తే ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసిక స్థితి మెరుగుపడటం, ఆందోళన తగ్గటం, ఆత్మవిశ్వాసం పెరగటం వంటి వాటికి దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇదీ చదవండి:భారత్లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!