గ్రూప్ బి స్ట్రెప్టోకాకస్(Group B Streptococcus) పేగుల్లో, జననాంగాల కింది భాగంలో ఉంటుంది. ఆరోగ్యవంతులైన పెద్దవారినిది అంతగా ఇబ్బంది పెట్టదు. ఈ బ్యాక్టీరియా ఉన్నా కూడా చాలామంది గర్భిణులకు కీడు చేయదు. ప్రపంచవ్యాప్తంగా సగటున 15% మంది.. ఏటా సుమారు 2 కోట్ల మంది గర్భిణులకు జీబీఎస్(Group B Streptococcus) సోకుతున్నట్టు అంచనా. ఇది ఉన్నా చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ పుట్టకముందు, పుట్టే సమయంలో, పుట్టిన తొలినాళల్లో తల్లి నుంచి పిండానికి, బిడ్డకు సోకొచ్చు. ఇది కొన్నిసార్లు తీవ్ర అనర్థాలకు దారితీయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా దీని అనర్థాలు ఊహించిన దాని కన్నా ఎక్కువగానే ఉంటున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా నివేదిక పేర్కొంటోంది.
జీబీఎస్(Group B Streptococcus) కారణంగా నెలలు నిండకముందే పుట్టటం, సెరిబల్ పాల్సీ, వినికిడి, చూపు లోపాల వంటి నాడీ సమస్యలను తొలిసారిగా నివేదికలో విశ్లేషించారు. జీబీఎస్(Group B Streptococcus) ఇన్‌ఫెక్షన్ మూలంగా ఏటా 5 లక్షల మందికి పైగా శిశువులు నెలలు నిండకముందే పుడుతున్నారు. సుమారు 1.5 లక్షల మంది శిశువులు మరణిస్తున్నారు. వీరిలో 46వేల మంది తల్లి గర్భంలోనే మరణిస్తుండటం ఆందోళనకరం.