తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అలసిన చేతులకు వ్యాయామం - ప్రొసెషన్

యుక్త వయసు వారి నుంచి వృద్ధుల వరకు చేతి వేళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు. చేతులను, వేళ్లను ఒక క్రమపద్ధతిలో కదిలిస్తూ రోజు మొత్తం మీద రెండు, మూడు సార్లు తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఈ నొప్పులని సులభంగానే అధిగమించవచ్చు. ఆ వ్యాయామాలేంటో తెలుసుకునేందుకు ఈ కథనం చదివేయండి మరి..

glimpse of Few exercises to handle finger and hand pains
అలసిన చేతులకు వ్యాయామం

By

Published : Dec 20, 2020, 2:46 PM IST

Updated : Dec 20, 2020, 3:29 PM IST

కంప్యూటర్ల పుణ్యమా అని ఒంటికి పని తగ్గింది.. చేతులకూ, మణికట్టుకు మాత్రం పని పెరిగింది. ఒక రకంగా నేటి తరం కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ అందరికీ చేతులు టకటక ఆడించక తప్పడం లేదు. దీంతో నేడు ఎంతోమంది రకరకాల చేతినొప్పులు, వేళ్ల నొప్పులు, మణికట్టు నొప్పులతో బాధపడుతున్నారు. చేతులను, వేళ్లను ఒక క్రమపద్ధతిలో కదిలిస్తూ రోజు మొత్తమ్మీద రెండుమూడు సార్లు తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఈ నొప్పులని సులభంగానే అధిగమించవచ్చు. వీళ్లే కాదు ఇంటిపని, వంటపని వంటి రకరకాల కారణాలరీత్యా రకరకాల చేతినొప్పులతో బాధపడుతున్న వారికి.. ముఖ్యంగా వేళ్లు బిగిసిపోవడం, చేతుల నొప్పుల వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా ఈ వ్యాయామాలు ఎంతో ఉపకరిస్తాయి..

మణికట్టు పైకి..కిందకి
(రిస్ట్‌ ఎక్స్‌టెన్షన్‌ / ఫ్లెక్షన్‌):

మణికట్టు పైకి..కిందకి

మెత్తని తువ్వాలుని తీసుకుని నాలుగైదు మడతలు వచ్చేటట్టుగా చేసి మడతపెట్టాలి. దాన్ని బల్ల అంచు దగ్గర ఉంచి ఇప్పుడు చేతి మణికట్టు కింద తువ్వాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే అరచేయి గాల్లో ఉండాలి. ఇప్పుడు ఆ అరచేతిని పైకి, కిందకి నెమ్మదిగా ఆడిస్తూ కొన్ని క్షణాలు అరచేతిని కొద్దిగా వెనక్కి స్ట్రెచ్‌ చేయండి.

అరచేయి పైకి.. కిందకి
(సపినేషన్‌ / ప్రొనేషన్‌):

అరచేయి పైకి.. కిందకి

స్థిమితంగా కూర్చుని లేదా నిల్చుని చేసే వ్యాయామం ఇది. మీ చేతిని తొంభైడిగ్రీల కోణంలో ఉంచి మీ ఎదురుగా ఉంచాలి. ఇప్పుడు అరచేతిని నేలపై చూస్తున్నట్టుగా ఉంచాలి. మరొకసారి ఆకాశంవైపు. ఇలా మార్చిమార్చి చేయాలి. దీనినే ప్రొనేషన్‌ అంటారు.

మణికట్టును పక్కకు ఆన్చి
(అల్నార్‌ / రేడియల్‌ డీవియేషన్‌):

మణికట్టును పక్కకు ఆన్చి

మనం ఇందాక చేసినట్టుగా ఒక తువ్వాలుని మడతలుపెట్టి, దానిపై మణికట్టుని ఉంచాలి. కాకపోతే మణికట్టుని తువ్వాలుపై పూర్తిగా ఆన్చకుండా ఒకవైపు మాత్రమే ఆన్చుతాం. ఇప్పుడు చేతిని పైకీ, కిందికి వూపుతాం.

బొటనవేలితో (ఫ్లెక్షన్‌ / ఎక్స్‌టెన్షన్‌)

బొటనవేలితో

అరచేతిని పూర్తిగా తెరిచి ఉంచి ఇప్పుడు బొటనవేలిని లోపలికి మడచిఉంచాలి. తర్వాత బయటకు తీసుకురావాలి. ఇలా ఓ మోస్తరు వేగంగా నాలుగైదు సార్లు చేయాలి.

ఫింగర్‌ టెండన్‌ గ్లైడ్‌

ఫింగర్‌ టెండన్‌ గ్లైడ్‌

మొదట అరచేతిని పూర్తిగా తెరిచి ఉంచాలి. అలానే ఉంచి వేళ్లను మాత్రం మడిచి ఉంచాలి. ఇప్పుడు మరింతగా కిందికి వేళ్లను నొక్కుతూ ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు మామూలుగా చేతివేళ్లను తెరిచి ఉంచాలి. ఇలా మార్చిమార్చి వ్యాయామం చేయాలి.

ఒక్కో వ్యాయామాన్ని ఐదు నుంచి పది సెకన్లపాటూ చేస్తే సరిపోతుంది. ఈ వ్యాయామాలు చేసిన తర్వాత కూడా నొప్పి, మొద్దుబారిన భావన ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే మేలు.

ఇదీ చదవండి:నీటి ద్వారా కొత్త వ్యాధి- కేరళలో ఒకరు మృతి

Last Updated : Dec 20, 2020, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details