మొక్కై వంగనిది మానై వంగదు అనేది పాత సామెతే... కానీ, ఈ కాలంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్నవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. బాల్యంలో మనం తీసుకునే ఆహారం పెద్దయ్యాక మన ఆహార అలవాట్లపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. పసి వయసులో పండ్ల రసాలు తాగిన పిల్లలు కౌమార వయసు వచ్చే సరికి.. పండ్ల రసాలు తాగని పిల్లలకంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని పరిశోధనలో స్పష్టమైంది.
బోస్టన్ వర్సిటీ చేపట్టిన ఓ అధ్యయనంలో మూడు నుంచి ఆరేళ్ల వయసులో ఉన్న వంద మంది బాలలు పాల్గొన్నారు. దాదాపు పదేళ్ల పాటు కొనసాగిన ఈ పరిశోధనలో.. బాల్యంలో ప్రతిరోజూ ఒకటిన్నర కప్పు తాజా పండ్ల రసాన్ని తాగిన పిల్లలు... రోజుకు సగం కప్పు పండ్ల రసం తాగిన పిల్లల కంటే ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. అంతే కాదు, వయసు పెరిగే కొద్దీ వారి ఆహార నియమాలూ ఆరోగ్యంగా మారుతున్నాయట. పైగా స్థూలకాయం బారిన పడట్లేదు.