తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

పిల్లలకు అన్ని రకాల టీకాలు వేయాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ వ్యాక్సిన్లను విస్మరిస్తే చిన్నారుల ఆరోగ్యానికి చేటని హెచ్చరిస్తున్నారు. కోరింత దగ్గు, డిఫ్తీరియా లాంటివి కొవిడ్‌ కంటే ప్రమాదకరమని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. కరోనా వేళ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను ఆస్పత్రులకు తీసుకెళ్లాలని చెబుతున్నారు.

By

Published : Jun 9, 2021, 8:09 AM IST

కొవిడ్‌ వేళ చిన్న పిల్లలకు ఇచ్చే సాధారణ టీకాలను నిర్ణీత కాలంలో ఇప్పించేందుకు చాలామంది తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ఆసుపత్రులకు తీసుకెళ్తే ఎక్కడ పిల్లలు వైరస్‌ బారిన పడతారోనని ఆందోళన చెందుతున్నారు. టీకాలను పూర్తిగా విస్మరించినా... ఎక్కువ జాప్యం చేసినా పిల్లల్లో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోరింత దగ్గు, డిఫ్తీరియా, ధనుర్వాతం, తట్టు లాంటి వ్యాధులు కొవిడ్‌ కంటే ప్రమాదకరమని చెబుతున్నారు.

అన్నీ ముఖ్యమే...

పుట్టిన వెంటనే శిశువుకు క్షయ, పచ్చకామెర్లు, పోలియో నివారణకు వినియోగించే బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్‌-బి వ్యాక్సిన్లు అందిస్తారు. తదుపరి డోసులను నిర్ణీత వ్యవధిలో కొనసాగించాల్సిందే. బీసీజీ, ఓరల్‌ పోలియో..6, 10, 14 వారాల్లో, రోటా వైరస్‌..9 నుంచి 12 నెలల మధ్య, మీజిల్స్‌ రుబెల్లా 16 నుంచి 24 నెలల మధ్య రెండో డోసు, పెంటావాలెంట్‌(డీపీటీ, ఓపీవీ, హెపటైటిస్‌) 6, 10, 14 వారాల్లో, తర్వాత డీపీటీ బూస్టర్‌ ఇలా చిన్నారులకు ఐదేళ్ల వరకు అందిస్తూ ఉండాలి. పదో ఏట డిఫ్తీరియా, టెటానస్‌కు మళ్లీ బూస్టర్‌ డోసు ఇవ్వాలి. బాలికలైతే వీటితోపాటు 10-15 ఏళ్లలోపు హెచ్‌పీవీ(హ్యుమన్‌పాపిలోమా వైరస్‌) టీకా రెండు డోసులు అందించాలి.

గరిష్ఠంగా 6 వారాలు దాటొద్దు

కరోనా వేళ చిన్నారులను ఆసుపత్రులకు తీసుకొచ్చే సమయంలో తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లౌజులు, మాస్కులు ధరించాలి. పిల్లలకు ఒంటి నిండా దుస్తులు తొడగాలి. సురక్షిత దూరం పాటించాలి. ఒక్కో డోసు మధ్య కనీసం 4 వారాల వ్యవధి ఉండాలి. గరిష్ఠంగా 6 వారాలు దాటకూడదు. మరీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తి మొదటి ఏడాది ఏవైనా టీకా డోసులు ఇవ్వలేకపోతే రెండో ఏడాది పూర్తయ్యేలోపు తప్పనిసరిగా ఇవ్వాలి. - డాక్టర్‌ డి.సుచిత్ర, చిన్న పిల్లల వైద్య నిపుణులు, గాంధీ ఆసుపత్రి

వైరస్‌ సోకితే 14 రోజుల తర్వాతే...

కరోనా వచ్చి తగ్గిన పిల్లలకు 14 రోజుల తర్వాతే ఇతర టీకాలు వేయించడం ప్రారంభించాలి. టీకా ఇచ్చేముందు శిశువుకు జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నాయా? అనేది పరిశీలించాలి. ఇంట్లో ఎవరైనా వైరస్‌ బారిన పడిన పక్షంలో 14 రోజుల తర్వాతే ఇవ్వడం మంచింది. లేదంటే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించి నెగెటివ్‌ వస్తే వేయించవచ్చు. మొత్తంగా అన్ని టీకాలు తప్పనిసరిగా వేయించాల్సిందే. - డాక్టర్‌ రంగయ్య, చిన్నపిల్లల వైద్య నిపుణులు, నియోబీబీసీ ఆసుపత్రి

ABOUT THE AUTHOR

...view details