చాలామంది తల్లిదండ్రులు వారి బుజ్జాయిల బరువు గురించి బాధపడుతూ ఉంటారు. 'మా పాప చాలా సన్నగా, బరువు తక్కువగా ఉందండీ.. దీంతో ఐదేళ్లొచ్చినా రెండేళ్లమ్మాయిలా కనిపిస్తుంది. తన బరువు పెంచాలంటే ఏం చేయాలో తోచట్లేదు.. మీకేమైనా అవగాహన ఉంటే కాస్త చెప్పండీ..' అంటూ ఇరుగుపొరుగు వారిని సలహాలు అడుగుతుంటారు. అయితే అనారోగ్యకర సలహాల వల్ల పిల్లలు బరువు పెరగకపోవడమే కాకుండా, వారి ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి వారిని ఓసారి పోషకాహార నిపుణుల వద్ద చూపించి, వారు బరువు పెరగడానికి నిపుణులు సూచించిన సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి. తద్వారా పిల్లలు తక్కువ బరువు నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉండాలో తెలుసుకుందాం...
బలవంతపెట్టొద్దు!
కొంతమంది తల్లులు పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని టెన్షన్ పడుతూ.. వాళ్లకు ఎలాగైనా ఆహారం తినిపించాలని నిర్ణయించుకుని బలవంతంగా తినిపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తినే ఆహారంపై వారికి ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ పద్ధతి వల్ల వారు తినకుండా మరింత మొండికేస్తుంటారు. దీనివల్ల వారికి అందాల్సిన పోషకాలు పూర్తిగా అందకుండా పోతాయి. కాబట్టి పిల్లల్ని ఆహారం విషయంలో బలవంతపెట్టకుండా.. వారికోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఏ పదార్థాలు, స్నాక్స్ ఇవ్వాలో ఓ ప్రణాళిక తయారుచేయాలి. దాని ప్రకారం వారికి పోషకాహారం అందించాలి. ఫలితంగా వారికి కావాల్సిన పోషకాలు అంది.. శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
వీటికి దూరంగా..
తల్లిదండ్రులు మామూలు సమయాల్లో టీవీ చూడనివ్వట్లేదని, కనీసం తినే సమయంలోనైనా టీవీ చూడచ్చని చాలామంది పిల్లలు ఆనందపడిపోతుంటారు. ఇక ఈ సాకుతో గంటలు గంటలు తినడానికే వృథా చేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల వారి ధ్యాసంతా ఆహారం మీద కంటే టీవీ మీదే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలేవీ వారు పట్టించుకోరు. అందులోని రుచి వారికి తెలియదు. ఈ క్రమంలో టీవీలో ఏవైనా ఆవేశపూరిత సన్నివేశాలొస్తే.. అవి వారి తిండి మీద, మనసు మీద ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఆటంకాల వల్ల వారు ఆహారం తీసుకోవడంపై మనసు లగ్నం చేయకపోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లలు తినే సమయంలో టీవీ ఆఫ్ చేసేయడం, మొబైల్స్, కంప్యూటర్, ల్యాప్‌టాప్స్.. వంటి గ్యాడ్జెట్లు వారికి దూరంగా ఉంచడం.. వంటివి చేయాలి. అలాగే వీటిపైకి మనసు మళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పక్కనే కూర్చొని పిల్లలు తినే ఆహార పదార్థాలపై వారికి అవగాహన కల్పించాలి. దానికి తగినట్టుగానే ఆహారం రంగు, రుచి, వాసన ఉండేలా చూసుకోవాలి. తద్వారా వారిలో ఆహారం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది.
క్యాలరీలూ ఆరోగ్యకరంగానే..
పిల్లలు తక్కువ బరువు నుంచి బయటపడాలంటే.. ముందుగా వారికి ఎక్కువ క్యాలరీలుండే ఆహారపదార్థాలు అందించాలి. అలాగని కేక్‌లు, స్వీట్లు, పిజ్జా, బర్గర్లు.. వంటివి పెట్టమని కాదు దానర్థం. చిక్కటి పాలు, మీగడ పెరుగు, ఆహారంలో భాగంగా నెయ్యి.. వంటి పదార్థాలతో పాటు విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభించే పండ్లు, కూరగాయల్ని కూడా వారి రోజువారీ ఆహారంలో భాగం చేయాలి. దీనిపై సరైన అవగాహన లేకపోతే సంబంధిత పోషకాహార నిపుణులను సంప్రదించి వారు సూచించే ఆహారాన్ని పిల్లలకు రోజూ అందివ్వాలి.