తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ప్రొటీన్​తో మధుమేహానికి చెక్.. రోజుకు ఎన్ని గ్రాములు తీసుకోవాలంటే? - ప్రొటీన్ ఫుడ్​తో మధుమేహంతో అనుమతి

Diabetes Control food: మధుమేహం ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. మధుమేహం అదుపు అనగానే ముందుగా పిండి పదార్థాలు, కొవ్వులే గుర్తుకొస్తాయి. ఇందులో ప్రొటీన్‌ పాత్రా తక్కువదేమీ కాదని ఓ అధ్యయనం తెలిపింది. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలను కాస్త తగ్గించుకొని.. ప్రొటీన్‌ మోతాదు పెంచుకుంటే మధుమేహాన్ని కట్టడి చేసుకోవచ్చని అధ్యయనంలో తేలింది.

diabetes control food
మధుమేహం

By

Published : Sep 6, 2022, 8:41 AM IST

Diabetes Control food: మధుమేహం అదుపు అనగానే ముందుగా పిండి పదార్థాలు, కొవ్వులే గుర్తుకొస్తాయి. ఇందులో ప్రొటీన్‌ పాత్రా తక్కువదేమీ కాదు. పిండి పదార్థాలను కాస్త తగ్గించుకొని, కొవ్వు పదార్థాలను మితం చేసుకొని.. ప్రొటీన్‌ మోతాదు పెంచుకుంటే మధుమేహాన్ని అక్కడికే కట్టడి చేసుకోవచ్చని (రెమిషన్‌).. ఆరోగ్యవంతులు, ముందస్తు మధుమేహులైతే నివారించుకోవచ్చనీ ఐసీఎంఆర్‌-ఇండియాబ్‌ తాజా జాతీయ అధ్యయనం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ పోషణ వారం సందర్భంగా శరీరం మీద ప్రొటీన్‌ ప్రభావం, మధుమేహంలో దీని పాత్రపై సమగ్ర కథనం మీకోసం.

మధుమేహంతో సంబంధమేంటి?
మధుమేహంతో ముడిపడిన ప్రతి జీవక్రియకు ప్రొటీన్లే మూలం కావటం గమనార్హం. అందుకే వీటి మోతాదులను పెంచుకోగలిగితే మధుమేహాన్ని రెమిషన్‌లో ఉంచుకోవచ్చు, నివారించు కోవచ్చు. మనం తిన్న ఆహారం జీర్ణమై, గ్లూకోజుగా మారుతుంది. ఇది కణాల్లోకి వెళ్లి, అక్కడ శక్తిగా మారుతుంది. వీటన్నింటిలోనూ ప్రొటీన్లే కీలకపాత్ర పోషిస్తున్నాయి. కణాల్లోకి గ్లూకోజు చేరుకో వటానికి తోడ్పడే ఇన్సులిన్‌ హార్మోన్‌ కూడా ప్రొటీనే కదా. వయసు మీద పడుతున్నకొద్దీ కండరాల్లో కొవ్వు పదార్థం చేరుతూ వస్తుంటుంది. ప్రొటీన్ల సామర్థ్యమూ తగ్గుతూ వస్తుంది. దీంతో కండర మోతాదు తగ్గుతూ కొవ్వు శాతం పెరుగుతూ వస్తుంది. దీనికి కారణం ప్రొటీన్‌ జీవక్రియలు మందగించటమే. పాంక్రియాస్‌లో తయారయ్యే ఇన్సులిన్‌ కాలేయంలో, కొవ్వు కణాల్లో, కండరాల్లోనూ ఉపయోగపడాలి. కొవ్వు మోతాదు పెరిగితే ఇవి ఇన్సులిన్‌ను సరిగా వాడుకోలేవు. ఇది ఇన్సులిన్‌ నిరోధకతకు దారితీస్తుంది. దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగిపోతాయి.

క్షీణిస్తూ.. పుట్టుకొస్తూ..
మన శరీరంలో ప్రొటీన్లు నిరంతరం తయారవుతూ వస్తుంటాయి. అలాగే క్షీణిస్తూ ఉంటాయి కూడా. చాలారకాల ప్రొటీన్లు కొద్ది వారాల నుంచి కొద్ది నెలల్లోపే క్షీణించిపోతాయి. ఉదాహరణకు- అల్బుమిన్‌ జీవనకాలం 6 వారాలు. హిమోగ్లోబిన్‌ 120 రోజుల వరకు జీవించి ఉంటుంది. తర్వాత క్షీణిస్తాయి. ప్రొటీన్లు అతి ముఖ్యమైన పదార్థాలు. ఇవి క్షీణించినా శరీరంలోంచి బయటకు వెళ్లిపోవు. పునర్వియోగమవుతూ వస్తాయంతే. క్షీణించినవి తిరిగి అమైనో ఆమ్లాలుగా మారి, ఇతర కణాల్లో రూపాంతరం చెందుతాయి. అక్కడ అవసరమైన పెప్టయిడ్లు, ప్రొటీన్లుగా మారతాయి. ఇదంతా ఒక చట్రంలా సాగుతూ వస్తుంది. నిజానికి ప్రొటీన్‌ తయారు కావటం కన్నా క్షీణించే ప్రక్రియే కీలకం. లేకపోతే క్యాన్సర్‌ కారకంగా మారే ప్రమాదముంది.

పోషకాలు రెండు రకాలు. తక్కువ మొత్తంలో అవసరమయ్యేవి సూక్ష్మ పోషకాలు. ఉదా: విటమిన్లు, ఖనిజాలు. పెద్దమొత్తంలో కావాల్సినవి స్థూల పోషకాలు. పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌), మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వు పదార్థాలు (ఫ్యాట్‌) వీటి కోవలోకి వస్తాయి. ఆహార విప్లవం అనంతరం మనం పిండి పదార్థాలు (61%), కొవ్వులు (25%) బాగానే.. ఆ మాటకొస్తే ఎక్కువే తీసుకుంటున్నాం. కానీ ప్రొటీన్ల విషయంలో వెనకబడిపోయాం. మనదేశంలో సుమారు 90% మంది ప్రోటీన్ల లోపంతో బాధపడుతుండటమే దీనికి నిదర్శనం.

ఒకప్పుడు మనదగ్గర క్వాషియార్కర్‌, మెరాస్మస్‌ వంటి పోషణ లోప సమస్యలు వేధిస్తుండేవి. కేలరీలు బాగానే తీసుకుంటున్నా ఆహారంలో ప్రొటీన్ల నిష్పత్తి తగ్గటం వీటికి మూలం. పిల్లలకు ప్రత్యేకంగా ప్రొటీన్‌తో కూడిన పదార్థాలు ఇవ్వటం ద్వారా 30 ఏళ్ల క్రితమే వీటిని అద్భుతంగా నిర్మూలించగలిగాం. దృష్టి దోషానికి కారణమయ్యే విటమిన్‌ ఏ లోపాన్ని కూడా దాదాపుగా అరికట్టగలిగాం. రక్తహీనతను ఒకింత తగ్గించినా ఇంకా కనిపిస్తూనే ఉంది. ఒకప్పుడు ప్రొటీన్ల లోపంతో పాంక్రియాస్‌ గ్రంథిలో రాళ్లు ఏర్పడటం వల్ల తలెత్తే మధుమేహం ఎక్కువగా ఉండేది. దీన్ని కూడా దాదాపుగా నిలువరించగలిగాం. ఒకవైపు ఇలాంటి పోషణ లోప సమస్యలను తగ్గిస్తున్నప్పటికీ.. మరోవైపు మధుమేహం, అధిక రక్తపోటు వంటి సాంక్రమికేతర జబ్బులు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధుమేహం గురించే. కొవిడ్‌ విజృంభణ తర్వాత ఇది మరింత ఎక్కువైంది కూడా. కాబట్టే దీన్ని అదుపులో ఉంచుకోవటం, నివారించుకోవటం అత్యావశ్యకంగా మారింది. ఇందులో ఆహారం పాత్ర చాలా కీలకం. ప్రొటీన్లు మరింత ప్రధాన భూమిక పోషిస్తుండటం గమనార్హం.

స్వల్ప మార్పులతోనే..
మధుమేహంతో బాధపడుతున్నవారిలో 64% మంది.. అంటే మూడింట రెండొంతుల మంది దీన్ని నియంత్రణలో ఉంచుకోలేకపోతున్నారు. వీరిలో 48% మంది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టుకోవటం లేదు. గత సంవత్సరం ప్రభుత్వం వెలువరించిన పరిశోధన ఫలితాల వివరాలివి. దీనికి ప్రధాన కారణం ఆహార అలవాట్లలో మార్పులే. తాజా ఐసీఎంఆర్‌-ఇండియాబ్‌ అధ్యయనమూ ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. ఇందులో మనదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆరోగ్యవంతులు, ముందస్తు మధుమేహులు, అప్పుడే మధుమేహం బయటపడ్డవారు, కొంతకాలంగా మధుమేహంతో బాధ పడుతున్నవారి ఆహార అలవాట్లను విశ్లేషించారు. పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకుంటుండటం.. ప్రొటీన్లు తగ్గిస్తుండటం మధుమేహం రావటానికీ, అలాగే తీవ్రం కావటానికీ దోహదం చేస్తున్నట్టు గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే పిండి పదార్థాలను 61 శాతం నుంచి 55 శాతానికి తగ్గించాలని, కొవ్వు పదార్థాలను 25 శాతానికే పరిమితం చేయాలని సూచించింది. అదే సమయంలో ప్రొటీన్లను 20% వరకు పెంచుకోవాలనీ సిఫారసు చేసింది. తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను తగ్గించుకోవటం మీద శ్రద్ధ పెడుతూనే ప్రొటీన్ల పరిమాణాన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరముందని అన్యాపదేశంగా చెబుతోంది. అలాగని మరీ అతి పద్ధతులు (కీటో డైట్‌, లోకార్బ్‌ డైట్‌, పాలియో డైట్‌) వద్దనీ సూచిస్తోంది. స్వల్ప మార్పులతోనే మధుమేహం తాత్కాలికంగానైనా అక్కడితోనే ఆగిపోతుండటం, నివారణ కూడా సాధ్యం అవుతుండటం విశేషం. ఆహారంలో కనీసం 15 శాతానికి పైగా ప్రొటీన్లు ఉండాలని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. కానీ మనం సగటున 12 శాతమే తీసుకుంటున్నాం. ఇప్పటివరకూ మధుమేహం విషయంలో ప్రోటీన్లను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పుకోవాలి. చాలాకాలంగా వీటిని పోషణ లోప సమస్యలతోనే ముడిపెడుతూ వస్తున్నాం. సాంక్రమిక, సాంక్రమికేతర, పోషణలోప జబ్బులన్నీ తక్కువ ప్రొటీన్ల ఆహారంతోనే తలెత్తుతున్నట్ట బయటపడుతున్న నేపథ్యంలో ఇవిప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇది నిజంగానే కొత్త విషయం.

అద్భుత పోషకం..
పిండి పదార్థం శరీరానికి శక్తిని సమకూరుస్తుంది. కొవ్వు శక్తిని దాచుకొని, అవసరమైనప్పుడు అందజేస్తుంది. ఈ రెండింటికి మధ్య ఇరుసుగా ఉపయోగపడేవి ప్రొటీన్లు. శరీరంలో జరిగే జీవక్రియలన్నీ వీటి రూపంలోనే జరుగుతాయి. ఆశ్చర్యంగా అనిపించినా విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్‌లు, యాంటీబాడీలు, హిమోగ్లోబిన్‌ వంటివన్నీ ప్రొటీన్లే. అవయవాలు, కండరాలు, నాడీ వ్యవస్థ, రక్త నాళాలు, అస్థి పంజరం వీటితో తయారైనవే. అన్నీ వీటి మీద ఆధారపడినవే. వీటిల్లో వేలాది రకాలున్నాయి. మనకు తెలియనివి ఇంకా ఎక్కువగానే ఉంటాయని అంచనా. ఎందుకంటే చిన్న చిన్న ప్రొటీన్లను గుర్తించటం సాధ్యం కాదు. ప్రతి ప్రొటీన్‌ కూడా శరీరానికి అత్యవసరమైన పనులు చేసి పెడుతుంది. మనం ఆహారం ద్వారా తీసుకున్న ప్రొటీన్‌ పదార్థాలు జీర్ణకోశంలో అమైనో ఆమ్లాలుగా మారతాయి. ఇవి కాలేయంలోకి, కణాల్లోకి చేరుకొని ప్రొటీన్లుగా తయారవుతాయి. అవసరాన్ని బట్టి కణాలు వీటిని తయారుచేసుకుంటాయి. సుమారు 20 రకాల అమైనో ఆమ్లాలున్నాయి. వీటిల్లో తొమ్మిది అత్యవసరమైనవి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో సల్ఫర్‌తో కూడిన అమైనో ఆమ్లాలు చాలా ప్రధానమైనవి. ఈ అత్యవసర అమైనో ఆమ్లాలను బట్టే ఆహారంతో లభించే ప్రొటీన్లు సంపూర్ణమైనవా? అసంపూర్ణమైనవా? అనేది ఆధారపడి ఉంటుంది. గుడ్లు, మాంసం, చికెన్‌, ఛీజ్‌, పాలలోని ప్రొటీన్లు సంపూర్ణమైనవి. వీటిల్లో అత్యవసర అమైనో ఆమ్లాలుంటాయి. గింజలు, విత్తనాలు, చిక్కుళ్లు, ధాన్యాల వంటి శాకాహార ప్రోటీన్లు అసంపూర్ణమైనవి. వీటిల్లో కొన్ని అత్యవసరమైన అమైనో ఆమ్లాలు మాత్రమే ఉంటాయి. అయితే సోయా ప్రొటీన్‌ దీనికి మినహాయింపు. అందువల్ల రకరకాల ఆహార పదార్థాలతో ఇవన్నీ లభించేలా చూసుకోవాల్సి ఉంటుంది.

పెంచుకోవటం పెద్ద చిక్కే..
గమనించాల్సి విషయం ఏంటంటే- ప్రొటీన్‌ పిండి పదార్థంతో గానీ ఇటు కొవ్వు పదార్థంతో గానీ కలిసి ఉండటం. ఉదాహరణకు- పప్పుల్లో 40% పిండి పదార్థం ఉంటుంది. నూనె గింజలు, గింజపప్పులు, మాంసంతో కొవ్వు పదార్థమూ ఎక్కువగానే లభిస్తుంది. కాబట్టి ఒక్క ప్రొటీన్‌ మోతాదునే పెంచుకోవటం అసాధ్యమనే చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రొటీన్‌ మోతాదు పెంచు కుంటూనే పిండి, కొవ్వు పదార్థాల దుష్ప్రభావాలు తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆయా వ్యక్తుల అవసరాలు, జబ్బులు (కిడ్నీ జబ్బు, గౌట్‌ వంటివి), ఆహార అలవాట్లను బట్టి పదార్థాలను ఎంచుకోవాలి. ఇందుకు ఆహార నిపుణుల సలహాలు తీసుకోవాలి.

.

ఇవీ చదవండి:క్యాన్సర్​ వస్తే మరణం తప్పదా.. ఇది ఎంతవరకు నిజం?

మడమ నొప్పి వేధిస్తోందా?.. ఈ ఆయుర్వేద చికిత్సతో సమస్య మటుమాయం!

ABOUT THE AUTHOR

...view details