Workout Common Mistakes To Avoid : శారీరక సామర్థ్యం (ఫిట్‌నెస్) బాగుంటే ఆరోగ్యమూ బాగుంటుంది. ఇందుకోసం వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే దీన్ని సక్రమంగా చేయటం ముఖ్యం. లేదంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్స్ర్సైజ్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- చాలా మంది ఎంతో ఉత్సాహంతో వ్యాయామం చేయడం మొదలుపెడతారు. కొద్ది రోజుల తరువాత బద్ధకం వల్ల లేదా చిన్నా చితకా కారణాలతో వ్యాయామాన్ని ఆపేస్తూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మీ బాడీ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
- ఎక్స్ర్సైజ్ చేయడానికి రెండు గంటల ముందు భోజనం చేస్తే కండరాలకు తగినంత రక్తం సరఫరా కాదు. దీని వల్ల వ్యాయామం చేసిన తరువాత బాగా అలసిపోతాం. ఈ బడలిక నుంచి త్వరగా కోలుకోవటం కూడా కష్టమవుతుంది. కొన్నిసార్లు కండరాలు పట్టేయటం, వికారానికి దారితీయవచ్చు.
- చాలా మంది డైరెక్టుగా హెవీ వర్క్అవుట్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. ముందుగా వార్మప్ చేసుకోవాలి. దీనితో క్రమంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. రక్త సరఫరా పుంజుకుంటుంది. ఫలితంగా కండరాలు వదులవుతాయి. తేలికగా కదులుతాయి.
- కండరాలను సాగదీసే సమయంలో కుదురుగా, స్థిరంగా ఉండటం తప్పనిసరి. అటూఇటూ కదులుతున్నట్టయితే కండరాలు నొప్పి మొదలవుతుంది. పైగా బిగుతుగా మారిపోతాయి. శరీరాన్ని సాగదీసిన ప్రతిసారీ 20 నుంచి 30 సెకండ్ల పాటు అదే భంగిమలో ఉండాలి.
5. వ్యాయామం చేసేటప్పుడు సరైన భంగిమలో ఉండేలా చూసుకోవాలి. లేకపోతే కింద పడవచ్చు, గాయాలు కావచ్చు. ఉదాహరణకు- ట్రెడ్‌మిల్ మీద నడిచేటప్పుడు పరికరం మీద వాలిపోకూడదు. శరీరం తిన్నగా ఉండేలా చూసుకోవాలి. బరువులు ఎత్తేటప్పుడు వెన్నెముకను తిన్నగా ఉంచాలి. భుజాలను వెనక్కి, విశ్రాంతిగా ఉంచాలి. మోకాళ్లను మరీ బిగుతుగా పట్టి ఉంచకూడదు.
6. చాలా మంది కొన్నిరకాల వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఊపిరి బిగపడుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఊపిరి బిగపడితే శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. కనుక బరువులు ఎత్తుతున్నప్పుడు ముందే గట్టిగా శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా బయటకు వదలాలి.