ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను పరిశుభ్రతతోనే కట్టడి చేయగలమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందువల్ల భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. అత్యవసరాలు.. కిరాణా సామగ్రి, మందులకు అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలి. అప్పుడు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ విషయంలో నాంపల్లి కేర్ ఆసుపత్రి వైద్యులు విజయ్ మోహన్ కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు.
"ఆహరం, కిరాణా సామగ్రి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని ఎలాంటి రుజువులు లేవు. కానీ ఉపరితలాలపై వైరస్ కొన్ని రోజుల పాటు జీవిస్తుంది. అందువల్ల శుభ్రత పాటించటం, అదనపు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. కిరాణా వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత నిల్వ చేసేముందు వాటిని శుభ్రం చేయాలి. "
- విజయ్ మోహన్, కేర్ ఆసుపత్రి వైద్యులు
బయటకు వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- దుకాణాలకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా నిర్ణయించుకోండి. వెళ్లిన తర్వాత.. ప్రజలతో ఎంత తక్కువగా కలిస్తే అంత భద్రంగా ఉంటారు.
- ముందుగానే వస్తువుల జాబితాను తయారు చేసుకోండి. అందువల్ల దుకాణాల్లో తక్కువ సయమంలో వస్తువులను కొనుక్కోవచ్చు.
- వస్తువుల జాబితాతో పాటు మాస్కు, గ్లవ్స్, శానిటైజర్‌ను తీసుకెళ్లండి.
- బయటకు వెళ్లేటప్పుడు మాస్కును ధరించటం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఎదుటివ్యక్తికి కరోనా సోకి ఉంటే.. అది మీకు సంక్రమించే ప్రమాదం ఉంది.
- దుకాణాల్లో డిస్పోసబుల్ గ్లోవ్స్ వాడండి.
- కుటుంబం నుంచి ఎవరైనా ఒక్కరు మాత్రమే బయటకు వెళ్లాలి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంట్లోనే ఉండటం ఉత్తమం.
బయటకు వెళ్లి వచ్చాక ఇలా చేయాలి..
- దుకాణం నుంచి బయటకు వచ్చిన వెంటనే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోండి. లేదా ఇంటికి వచ్చాక సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలి.
- ఇంటికి రాగానే స్నానం చేసి, మీరు వేసుకెళ్లిన దుస్తులను ఉతకాలి.
- పండ్లు, కూరగాయలను నీటితో కడగండి. వాటిని శుభ్రం చేసిన వెంటనే తినవద్దు.
- ఉపరితలాలపై కరోనా వైరస్ 1 నుంచి 3 రోజుల పాటు జీవిస్తుందని ప్రాథమిక పరిశోధనలు వెల్లడించాయి. ఆ తర్వాత వాటిని ఉపయోగించండి.
- తినదగని వస్తువులను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి.
ఈ సమయంలో మనం తీసుకునే ప్రతి జాగ్రత్త.. కరోనాపై భారత్ చేస్తోన్న పోరాటంలో భాగం అవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టి ప్రాణహానిని తగ్గించవచ్చు.
ఇదీ చూడండి:'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'