Best Foods For Good Sleep In Telugu: నిద్రకు ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా? మన ఆహారపు అలవాట్లతో నిద్ర లేమి సమస్యలు వస్తాయా? అంటే అవుననే చెప్పాలి. వాస్తవానికి మన ఆహారపు అలవాట్లతోనే నిద్రకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. నిద్ర లేమితో బాధపడే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర-ఆహారానికి ఎంతో దగ్గర సంబంధం ఉందని, మంచి ఆహారపు అలవాట్లు ఉన్నవారు హాయిగా నిద్రపోతారని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
నిద్ర లేకపోతే..
నిద్ర సరిపోకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కంటినిండా నిద్ర లేకపోతే డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి మన మెదడులోని మెలటోనిన్ అనే రసాయనం వల్ల నిద్ర వస్తుంది. ఒక వేళ ఈ మెలటోనిన్ విడుదల సరిగా లేకపోతే నిద్ర లేమి సమస్యలు వస్తాయి. దీంతో చికాకు, డిప్రెషన్, త్వరగా అలసిపోవడం, అజీర్తి లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే మంచి నిద్ర పట్టాలంటే కొన్ని ఆహారపు అలవాట్లు చేసుకోవాలని.. వైద్యులు సూచిస్తున్నారు.
విశ్రాంతి అవసరం
రాత్రి భోజనం అవ్వగానే నిద్ర వస్తుందంటే.. మన శరీరం విశ్రాంతి కోరుకుంటోందని అర్థం. రాత్రులు సరిగ్గా నిద్రపోవాలంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మాములుగా ఆహారం ఎక్కువగా తీసుకుంటే నిద్ర పట్టదు అంటారు. అలాగే తక్కువగా తీసుకున్నా నిద్ర పట్టదు. అందుకే పొట్ట తేలిగ్గా ఉండేలా, సరైన పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
సమస్యలు వస్తాయ్!
నిద్రకు భంగం కలిగితే అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డిప్రెషన్, ఇన్సోమ్నియా, అజీర్తి లాంటివి వచ్చే అవకాశం ఉంది. పొట్ట ఉబ్బడం, శక్తి తగ్గిపోవడం, నీరసంగా ఉండటం, ఎక్కువగా అనారోగ్యానికి గురికావడం లాంటివి జరుగుతాయి. మంచి నిద్ర పట్టడానికి కొన్ని రకాల మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నీరు తీసుకోవాలి. పడుకునే వాతావరణం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అతిగా సెల్‌ఫోన్ వాడకం, టీవీలు చూడడం లాంటి అలవాట్లను మానుకోవాలి. అంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. నిద్రకు కనీసం రెండు గంటల ముందు ఫోన్ చూడటం ఆపేయాలి.
ఆ రసాయనం
మెలటోనిన్ అనే రసాయనం మన స్లీప్ సైకిల్‌కు కారణమవుతుంది. మనం తీసుకునే ఆహారంతో ఈ మెలటోనిన్ రసాయనం ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసుకోవాలి. ఇందుకోసం ఓట్స్ లాంటి మంచి పోషకాహారాన్నిఆహారంలో భాగంగా తీసుకోవాలి. అలాగే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అందేలా సమతులాహారాన్ని మన మెనూకు జతచేసుకోవాలి.