తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ ఆయుర్వేద డ్రింక్​తో కరోనాకు చెక్! - immunity drink

ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మన చేతిలో ఉన్న ఆయుధం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. అందుకే చాలామంది తమకు తెలిసిన ఇంటి చిట్కాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుర్వేదంలో వందల ఏళ్ల క్రితమే ఓ అద్భుతమైన డ్రింక్‌ ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఏంటా డ్రింక్‌? అదెలా తయారుచేస్తారు? తెలుసుకుందాం రండి..

ayurvedic kadha drink to get rid of corona virus
ఈ ఆయుర్వేద డ్రింక్ తో కరోనాకు చెక్!

By

Published : Aug 18, 2020, 10:31 AM IST

గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం- తేనె కలుపుకొని తాగడం, అల్లం- మిరియాలు-పసుపు.. వంటి పదార్థాలతో కషాయం తయారు చేసుకొని తీసుకోవడం.. ఇలా ఎవరికి తోచిన చిట్కాలు వాళ్లు పాటిస్తూ కరోనా బారిన పడకుండా తమ రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. ఇంకొందరేమో ఇమ్యూనిటీ డ్రింక్స్‌ గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారికోసమే ఈ అద్భుతమైన ఆయుర్వేద ఔషదం..

ఈ ఆయుర్వేద డ్రింక్​తో కరోనాకు చెక్!

ఎలా తయారుచేయాలంటే..!

కరోనా బారిన పడిన ఓ అమ్మాయి తన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం రోజూ ఈ డ్రింక్‌ తాగిందని, తద్వారా ఈ మహమ్మారిని జయించిదంటూ కాఢా డ్రింక్‌ రెసిపీ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు అనహిత. 'రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన కాఢా పానీయం ఎలా తయారుచేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు..

  • యాలకులు - 2
  • పచ్చి పసుపు కొమ్ము - చిన్నది (దీన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది లేకపోతే పసుపు కూడా వాడొచ్చు)
  • లవంగాలు - కొన్ని
  • మిరియాలు - కొన్ని
  • తులసి ఆకులు - ఐదారు
  • దాల్చిన చెక్క – రెండు పెద్ద ముక్కలు
  • అల్లం - చిన్న ముక్క (కచ్చాపచ్చాగా దంచుకోవాలి)

తయారీ

ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఆరు కప్పుల నీళ్లు తీసుకొని.. అందులో దంచిన పసుపు, అల్లం వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరగడం ప్రారంభమైన తర్వాత మిగిలిన పదార్థాలను కూడా వేసి అరగంట పాటు మరిగించాలి. ఆపై గ్లాస్‌లో వడకట్టుకోవాలి. ఈ మిశ్రమంలో టీస్పూన్‌ తేనె కూడా కలుపుకోవచ్చు.

ఈ ఆయుర్వేద డ్రింక్ తో కరోనాకు చెక్!

రోజుకు రెండుసార్లు..

ఇదే వీడియోకు ఓ సుదీర్ఘమైన క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చారామె. '"కాఢా - రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆయుర్వేదిక్‌ ఔషధం. జలుబు, దగ్గు, ఫ్లూ.. వంటి అనారోగ్యాలను ఇది దూరం చేస్తుంది. అంతేకాదు.. కరోనా మహమ్మారి బారిన పడినా త్వరగా కోలుకునేలా చేస్తుంది.

  • ఈ డ్రింక్‌ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి శక్తిని అందించే ఈ పానీయం తాగడం వల్ల ఎంతో బలంగా ఉన్నామన్న భావన కలుగుతుంది. కాఢా డ్రింక్‌లో రుచి కోసం మరింత దాల్చిన చెక్క, బెల్లం కూడా కలుపుకోవచ్చు.
  • ఈ పానీయం తయారీలో మనం ఉపయోగించిన మసాలాలన్నింటిలో బోలెడన్ని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి.
  • ఇక మిరియాలు, పసుపు కలవడం వల్ల మన శరీరానికి పసుపును గ్రహించే శక్తి రెండు వేల వంతులు పెరుగుతుంది. అయితే ఒక వంతు మిరియాలకు, పది వంతుల పసుపు కలిపినప్పుడే ఈ ఫలితాన్ని పొందగలం.
    ఈ ఆయుర్వేద డ్రింక్​తో కరోనాకు చెక్!
  • మిరియాలు శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గించి.. ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.
  • అసలే ఇప్పుడు కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది.. దీనికి తోడు ఇది వర్షాకాలం కూడా కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ పానీయం తాగాల్సిందే! రోజుకు రెండుసార్లు వేడిగా లేదంటే గోరువెచ్చగా ఈ డ్రింక్‌ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..!"

ఏ పదార్థంతో ఏ ప్రయోజనం?

గతంలోనూ 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆయుష్‌ మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్‌లోనూ ఈ రెసిపీ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అలాగే పలువురు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు కూడా కాఢా డ్రింక్‌ రోగనిరోధక శక్తికి అద్భుత ఔషధమని, తాము కూడా తమ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఈ పానీయం తాగుతున్నామంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ పానీయం తయారీలో మనం ఉపయోగించిన పదార్థాల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

  • దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ - ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తాయి.
  • యాలకులు గొంతునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో లవంగాలు బాగా పనిచేస్తాయి.
  • నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్‌ అనే ఆల్కలాయిడ్‌ సమ్మేళనం వికారం, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మిరియాల్లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువే.
  • పసుపులో కర్క్యుమిన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఎలాంటి అనారోగ్యాన్నైనా దూరం చేసే శక్తి దీని సొంతం. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ-ఫంగల్‌ గుణాలు కూడా అధికంగా ఉంటాయి.
  • జీర్ణశక్తిని పెంచడంలో తులసి ఆకులను మించింది లేదు. ఇందులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే తులసి శరీరంలోని విషపదార్థాలను తొలగించి కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • అల్లం.. దగ్గు, జలుబుల నుంచి ఉపశమనాన్ని కలిగించడంతో పాటు వికారాన్ని తగ్గిస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచి గ్యాస్ట్రిక్‌ సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది.

చూశారుగా.. రోగనిరోధక శక్తిని పెంచే కాఢా పానీయం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో! అందుకే ఇక నుంచైనా నిర్లక్ష్యంగా కాకుండా రోజుకు రెండుసార్లు ఈ డ్రింక్‌ తాగుదాం.. ఇమ్యూనిటీని పెంచుకుందాం.. కరోనాకు దూరంగా ఉందాం..!

ఇదీ చదవండి: కంటిని కంటికి రెప్పలా కాపాడుకునే పద్ధతి ఇదే..!

ABOUT THE AUTHOR

...view details