Avoid These Mistakes for Eyes Healthy :శరీరంలో అన్నింటికంటే కళ్లు చాలా ముఖ్యమైన అవయవాలు. అందుకే 'సర్వేంద్రియం నయనం ప్రధానం' అంటారు పెద్దలు. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కళ్లకు ఎలాంటి హాని కలగకుండా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం పెరిగిన స్మార్ట్ఫోన్ల వాడకం, కాలుష్యం, ఆహారపు అలవాట్లు.. ఇలా పలు కారణాల వల్ల చాలా మంది వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇవే కాదు.. తెలిసి తెలియక మనం నిత్యం చేసే కొన్ని సాధారణ పొరపాట్లు కూడా కళ్ల(Eyes) ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. వాటి కారణంగా కూడా కంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ తప్పులు చేయకుండా ఉండాలంటున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వెచ్చని నీటిని ఉపయోగించడం :మనలో చాలా మంది చలికాలం వచ్చిందంటే చాలు కళ్లతో సహా ముఖాన్ని వేడి నీటితో కడుక్కోవడం మొదలుపెడతారు. అయితే ఇది కంటికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా కాకుండా కళ్లను ఎప్పుడూ వేడి నీటితో కాకుండా రూమ్ టెంపరేచర్‌కు అనుగుణంగా ఉన్న నీరు లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలంటున్నారు.
తరచుగా రెప్పవేయకపోవడం :ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగింది. దాంతో చాలా మంది వాటిని చూసే క్రమంలో తరచుగా రెప్ప వేయకుండా అలాగే స్క్రీన్ చూస్తూ ఉండిపోతాం. ఇది కూడా కళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అలా కాకుండా తరచుగా రెప్పవేయడానికి ట్రై చేయాలని సూచిస్తున్నారు. వాస్తవంగా రెప్పవేయడం సహజమైన శారీరక ప్రక్రియ.
కళ్లు రుద్దడం :ఇక మనలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏ కారణం చేతనైనా తరచుగా కళ్లు రుద్దడం. అయితే కళ్లు అనేవి కండ్లకలక నుంచి రక్షణ పొందేందుకు చాలా సన్నని పొరను కలిగి ఉంటాయి. రుద్దడం ద్వారా అది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రుద్దే బదులు చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలాగే రుద్దడం ద్వారా పైన ఉన్న బ్యాక్టీరియా, మురికి కళ్లలోకి వెళ్తాయి. దీనివల్ల కంటిశుక్లాలు, మచ్చలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.