సాధారణంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. తద్వారా ఆయా అవయవాల పనితీరు చురుగ్గా ఉంటుంది. అదే.. రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పడిపోతే దాని ప్రభావం ఊపిరితిత్తులతో పాటు అన్ని శరీర భాగాలపై పడుతుంది. కరోనా కారణంగా ప్రస్తుతం చాలామందిలో ఇలాంటి సమస్యే తలెత్తుతోంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయులు 94-100 మధ్యలో ఉన్నట్లయితే మనకు తగినంత ప్రాణ వాయువు అందుతున్నట్లు లెక్క! అదే ఈ స్థాయులు 91-94 మధ్యలో నమోదైతే ఆక్సిజన్ లెవెల్స్‌ని తరచూ పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇక 91 కంటే దిగువకు పడిపోయినా, ఎక్కువ సమయం పాటు అలాగే కొనసాగినా వైద్య చికిత్స అవసరమవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆక్సీమీటర్ సహాయంతో మన శరీరంలో ఆక్సిజన్ స్థాయుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
డాక్టర్ దగ్గరికి ఎప్పుడెళ్లాలి?
ఇలా ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగని ఈ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్పత్రి అవసరం ఉంటుందా అంటే.. లేదంటున్నారు ఎయిమ్స్ వైద్యులు. అయితే బాధితులు తమ ఆరోగ్యం విషయంలో కొన్ని లక్షణాలను గమనిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్లాలంటున్నారు. అవేంటంటే..!
- ఆక్సిజన్ స్థాయులు 91 కంటే దిగువకు చేరుకొని క్రమంగా తగ్గుతుండడం.. రెండు గంటలకు పైగా ఇలాంటి పరిస్థితే కొనసాగడం.
- ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్న వారిలో కొవిడ్ కారణంగా ఆక్సిజన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఎదురుకావడం.
- చర్మం, పెదాలు నీలం రంగులోకి మారడం. దీన్నే వైద్య పరిభాషలో సయనోసిస్ గా పేర్కొంటున్నారు వైద్యులు. శరీరంలో ఆక్సిజన్ స్థాయులు బాగా పడిపోయినప్పుడు ఇలా జరుగుతుందట! ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి పరుగుపెట్టాల్సిందేనంటున్నారు.
- సాధారణంగా మన రక్తంలో ఆక్సిజన్ స్థాయులు సరిపడినంత మోతాదులో ఉంటే చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. అదే వాటి స్థాయులు బాగా పడిపోతే క్రమంగా ముఖ చర్మం రంగు మారిపోతుందంటున్నారు నిపుణులు. అంటే.. ఆస్పత్రిలో చేరాల్సిన సమయం ఆసన్నమైందని దీని అర్థమట!
- ఛాతీలో విపరీతమైన నొప్పి రావడం.. ఛాతీపై భరించలేనంత ఒత్తిడి పెట్టినట్లుగా అనిపించడం.
- నిరంతరాయంగా దగ్గు రావడం.
- విపరీతమైన తలనొప్పి, అలసట వేధించడం.
- క్రమంగా తగ్గే ఆక్సిజన్ స్థాయులు మెదడు పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయట! తద్వారా ఏకాగ్రత లోపించడం, చూపు మందగించడం, మైకం కమ్మినట్లుగా అనిపించడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మరో ఆలోచన లేకుండా ఆస్పత్రికి వెళ్లి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
‘ప్రోనింగ్’తో ప్రాణవాయువు అందుతుందట!
ఆక్సిజన్ స్థాయులు పడిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైన వారంతా భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. నిజానికి ఆ అవసరం లేదని, ఇంట్లోనే ‘ప్రోనింగ్’ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ స్థాయుల్ని మెరుగుపరచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ మేరకు ఇటీవలే ఈ పద్ధతికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.
- ప్రోనింగ్ అనేది వైద్యపరంగా అంగీకరించిన ఒక సురక్షితమైన పద్ధతి. ఇందులో భాగంగా ముఖం కిందికి పెట్టి బోర్లా పడుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తుల్లో ఉండే అల్వియొలార్ యూనిట్స్ తెరుచుకుంటాయి. ఫలితంగా ఊపిరి అందుతుంది.. సౌకర్యవంతంగానూ అనిపిస్తుంది.
- ఆక్సిజన్ స్థాయులు 94 కంటే పడిపోతే ఈ పద్ధతి అవసరమవుతుంది.
- హోమ్ ఐసొలేషన్‌లో ఉన్న వారు ప్రోనింగ్ చేయడంతో పాటు ఆక్సిజన్ స్థాయులు, శరీర ఉష్ణోగ్రత, బీపీ, షుగర్ లెవెల్స్.. వంటివి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
- ఆక్సిజన్ స్థాయుల్ని గుర్తించడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అది హైపోక్సియా (ఆక్సిజన్ స్థాయులు బాగా పడిపోవడం)కు దారితీయచ్చు. తద్వారా పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదమూ ఉంటుంది. అందుకే సమయానికి ప్రోనింగ్ పద్ధతిని పాటిస్తే ఈ విపత్తు నుంచి బయటపడచ్చు.