మనలో చాలామందికి ఉన్న సమస్య పొట్ట. కొంతమందికి పైపొట్ట ఎక్కువగా ఉంటే మరికొందరికి కింది పొట్ట బాగా కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించాలంటే.. రోజులో కేవలం పదినిమిషాలు ఈ వ్యాయామాలు చేసి చూడండి. పదిరోజులు మానకుండా చేస్తే.. పొట్ట తగ్గడం ఖాయం.
- నిటారుగా నిలబడి రెండు చేతులూ పైకెత్తాలి. మెల్లగా ముందుకు వంగి రెండు చేతుల వేళ్లూ నేలపై ఉంచి.. కుడికాలిని వెనక్కి చాచి పైకి లేపాలి. తరువాత కిందకు దించేయాలి. ఇప్పుడు ఎడమకాలిని వెనక్కిచాచి కుడికాలిని నేలపై ఉంచాలి. ఇలా కాళ్లు మారుస్తూ.. ఇరవైసార్లు ఈ వ్యాయామాన్ని చేయాలి.
- వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ దగ్గరకు మడిచి ఉంచాలి. రెండు చేతులూ కాళ్లకు కొంచెం పక్కన ఉంచి, తలా, భుజాలూ కొద్దిగా పైకి లేపి కుడిచేత్తో కుడికాలి వేళ్లను పట్టుకోవాలి. యథాస్థానానికి వచ్చి ఎడమచేత్తో ఎడమ కాలి వేళ్లను తాకాలి. ఇలా కుడిచేత్తో ఒకసారీ, ఎడమ చేత్తో ఒకసారి మార్చిమార్చి ఇరవై సార్లు చేయాలి. దీనివల్ల పొట్ట పక్కల ఉండే కొవ్వు బాగా తగ్గుతుంది.
- బోర్లా పడుకుని రెండు కాళ్లు దగ్గరగా ఉంచాలి. రెండు మోచేతులూ నేలమీద ఆనించి చేతివేళ్లను కలిపి ఉంచాలి. పాదాల్ని కొద్దిగా పైకెత్తి వేళ్ల మీద ఉంచాలి. ఇప్పుడు మోచేతులూ, కాలి వేళ్లపై బరువుని ఉంచుతూ శరీరాన్ని లేపాలి. ఈ స్థితిలో ఇరవై సెకన్లు ఉండాలి.
- వెల్లకిలా పడుకుని రెండు చేతుల్ని పిరుదుల కింద ఉంచి, కాళ్లు ఒకేసారి కుడినుంచి ఎడమవైపు గుండ్రంగా తిప్పాలి. అలా పదిసార్లు చేసిన తర్వాత ఎడమ నుంచి కుడికి పదిసార్లు చేయాలి. పొట్ట దగ్గర కొవ్వు బాగా తగ్గుతుంది.
- వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ మడిచి ఉంచాలి. రెండు అరచేతులు ఒకదానితో ఒకటి కలిపి తల కింద పెట్టుకోవాలి. తల, భుజాలూ పైకి లేపి... ఎడమ మోచేతిని కుడిమోకాలికి తాకించాలి. అలా చేస్తున్నప్పుడు రెండో కాలు నిటారుగా ఉంచాలి. ఇప్పుడు కుడిమోచేతిని ఎడమ మోకాలికి తాకించాలి. ఇలా కాళ్లు మార్చి ఇరవై సార్లు చేయాలి.