ఇంట్లో తయారు చేసే ఫుడ్ కంటే జంక్ ఫుడ్ అంటనే పిల్లలు లొట్టలేసుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తారు. అయితే తమ చిన్నారుల దృష్టిని వీటిపై నుంచి మరల్చే విషయంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారనే చెప్పాలి.
ఎందుకంటే బయటికి వెళ్లిన ప్రతిసారీ చిప్స్, బిస్కట్స్, పిజ్జా, బర్గర్ అంటూ వారికి అలవాటు చేయడమే వారికి ఇంటి ఆహారం నచ్చట్లేదు. కాబట్టి ఈ అలవాటు మాన్పించాలంటే.. పిల్లల కంటికి నచ్చేలా కాదు.. నోటికి రుచించేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వడం తల్లుల బాధ్యత. మొన్నటిదాకా అంటే బిజీబిజీ పనుల వల్ల అది కుదరకపోవచ్చు.. కానీ ఈ లాక్‌డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని అందుకు వినియోగించండి.. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవర్చండి. అందుకు తల్లులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఎలాంటి ఆహారం ఇస్తున్నారు..?
ప్రస్తుత పరిస్థితుల్లో పండ్లు, కూరగాయలు.. మొదలైనవి కృత్రిమ పద్ధతిలో పెంచినవి/పండించినవే మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తున్నాయి. వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి హాని చేసే ఎన్నో రకాల రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే పిల్లలను వాటికి దూరంగా ఉంచడం ఉత్తమం. వీలైనంత వరకు వాళ్లకు సహజ సిద్ధంగా- వీలైతే ఇంటి ఆవరణలో పండించిన కూరగాయలు, పండ్లు ఇవ్వడానికి ప్రయత్నించండి. పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, గింజలు, డ్రైఫ్రూట్స్.. మొదలైన వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేయండి.
పిల్లలకు సీజనల్ పండ్లను అందించండి...
పిల్లలకు సీజనల్ పండ్లను అందించండి. ఉదాహరణకు.. వేసవి కాలంలో పుచ్చకాయలు, చలికాలంలో యాపిల్స్ తినడం మంచిది. ఈ క్రమంలో పిల్లలు రోజుకు కనీసం ఒక్క పండైనా తినేలా చూసుకోండి. వీటి ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందడమే కాకుండా.. పిల్లలు చిన్నతనం నుంచే అన్ని రకాల ఆహారాలను తినడానికి అలవాటు పడతారు.
చిరుతిండ్ల విషయానికొస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే నూడుల్స్, పాస్తా, చాక్లెట్స్, కేక్, చిప్స్.. మొదలైన వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇవి శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. వీటికి బదులు ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్‌ని మీరే ఇంట్లో తయారుచేసి వారికి తినిపించండి.
ముందు మీరు అలవాటు చేసుకోండి..!
సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులను ఎక్కువగా గమనిస్తూ.. వాళ్లు చేసే పనులను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా ఆహారం విషయంలో కూడా తల్లిదండ్రులు తినే ఆహార పదార్థాలనే పిల్లలూ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ మీకు ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినే అలవాటు ఉంటే ఫర్వాలేదు. ఆ అలవాటు లేనివాళ్లు పిల్లల కోసం మీ ఇష్టాలను పక్కనబెట్టి వాటిని తినడం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని చూసి వాళ్లూ వాటిని తినడం అలవాటు చేసుకుంటారు. అంతేకానీ, వాళ్లతో బలవంతంగా వాటిని తినిపించడానికి ప్రయత్నిస్తే వాటిపై అయిష్టత పెరిగి.. జీవితంలో ఇక వాటి జోలికి వెళ్లకుండా తయారయ్యే అవకాశం కూడా ఉంది.
వంట పనుల్లో భాగం చేయండి..!