యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే అత్యాధునిక హంగులతో అతిథుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు యాడా కృషి చేస్తోంది.
ఆధునిక హంగులతో..
యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే వీవీఐపీల బస కోసం 13 ఎకరాల విస్తీర్ణంలో ప్రధానాలయానికి ఉత్తరం దిశలోని మరో కొండపై నిర్మిస్తున్నారు. సుమారు రూ.104 కోట్లతో చేపట్టిన 15 విల్లాల పనులు తుది దశకు చేరుకున్నాయి. అత్యాధునికంగా నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ విల్లా ఎదుట ఫ్లోరింగ్, గ్రీనరీ పనులు పూర్తయ్యాయి. మిగతా విల్లాల్లో ఇంటీరియర్, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్, విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. వీటిని అతి త్వరలో పూర్తి చేసేందుకు యాడా కసరత్తు చేస్తోంది. కొండపైన విల్లాలు, కింది భాగంలో రిటైనింగ్ వాల్ నిర్మించి పచ్చదనం కోసం మొక్కలను పెంచుతున్నారు.
కోల్‌కతా ఫర్నీచర్
విల్లాల నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు, చేర్పులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ రెండు అంతస్తులు 13వేల ఎస్‌ఎఫ్‌టీలో నిర్మాణం చేశారు. ఇందులో 6 పడక గదులు, వెయిటింగ్ హాల్, డైనింగ్ హాల్, కిచెన్‌తో పాటు సేదతీరడానికి సిట్ అవుట్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఉడెన్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన కిటికీలు, టేకుతో చేసిన ద్వారాలను బిగించారు. విల్లాల్లో ప్లంబింగ్ పనులు, బాత్ రూమ్, వంట గదులకు సంబంధించి చిన్న చిన్న పనులు చేపట్టాల్సి ఉంది. అదనపు ఆకర్షణ కోసం కోల్‌కతాలో టేకుతో తయారు చేసిన ఫర్నిచర్ తీసుకువచ్చారు.
వారికోసమే..
సెంట్రల్ ఏసీ పడక గదులు, సెన్సార్ సిస్టమ్ గ్లాస్, టేకు ద్వారాలు, పూల మొక్కలు తదితర హంగులతో యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రముఖుల బస కోసం ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను నిర్మిస్తున్నారు. ఈ నెల చివరికల్లా పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన సూట్, 13 విల్లాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. యాదాద్రీశుడి ఆలయ అభివృద్ధిలో భాగంగా అధునాతన వసతులతో ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రముఖులు వచ్చినప్పుడు బస చేయనున్నారు.