తెలంగాణ

telangana

ETV Bharat / state

వేడుకకు వేళాయే: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలట... కోరిన కోర్కెలు తీరునట! - yadadri latest news

సగం మనిషి, సగం మృగం ఆకారం దాల్చి... దశావతారాల్లో నాలుగో అవతారంగా ప్రహ్లాదుడికి దర్శనమిచ్చిన నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రమే యాదాద్రి. ఏటా ఆ యాదగిరీశుడికి అంగరంగవైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేటి నుంచి పదకొండురోజుల పాటు జరగనున్న ఈ వేడుకల సందర్భంగా యాదాద్రి క్షేత్రం గురించీ, బ్రహ్మోత్సవాల ప్రత్యేకత గురించీ తెలుసుకుందామా...

yadadri narasimha swamy brammostaval
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

By

Published : Feb 25, 2020, 10:39 PM IST

Updated : Feb 26, 2020, 12:16 AM IST

త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారం కోసం ఆవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం- నృసింహస్వామి. ప్రహ్లాదుడి విన్నపం మేరకు వెంటనే ఆవిష్కారమైన అవతార పరంపరలో నరసింహావతారం విశేషమైనది. మృగమూ కాకుండా, మనిషీ కాకుండా నరజంతు రూపంలో స్వామి సాకారమయ్యాడు. హిరణ్య కశిపుడు పొందిన వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా మూర్తిమత్వాన్ని ప్రకటించి అతణ్ని వధించిన నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. యాదాద్రిలో జరగబోయే బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

లౌకిక పరమైన సౌఖ్యాలు, సంపదలు, అనంతమైన కోరికల విషవలయంలో చిక్కుకుని, హృదయంలో వెలిగే పరంజ్యోతిని హిరణ్య కశిపుడు దర్శించలేకపోయాడు. తన వాడి గోళ్లతో, అసురుడి హృదయాన్ని పెరికి అందులో వెలిగే జ్ఞానజ్యోతిని దర్శింపజేసి, హిరణ్య కశిపుడికి నృసింహుడు ముక్తిని ప్రసాదించాడు. చీకటి-వెలుతురు, మంచి-చెడు, రాత్రి-పగలు, మానవత్వం-దానవత్వం, నిద్ర-మెలకువ... ఇలా ద్వంద్వాత్మక ప్రవృత్తితో జగత్తు కొనసాగుతుంది. ఆ రెండు అంశాల సంధిలో అవగతమయ్యే తత్త్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ద్వంద్వాత్మక స్థితులకు అతీతంగా మసలుకుని, ఏకోన్ముఖంగా చైతన్య పూరితంగా వ్యవహరించాలి. నృసింహావతారం అందించిన సందేశమిదే!

హిరణ్యకశిపుడి వధ తరవాత తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించి, ప్రహ్లాదుడికి ప్రేమాస్పద మూర్తిగా స్వామి దర్శనాన్ని అనుగ్రహించాడంటారు. అలా నరహరి ప్రసన్నకారకమూర్తిగా తేజరిల్లిన క్షేత్రమే- యాదాద్రి. పంచనారసింహ క్షేత్రంగా వర్ధిల్లుతున్న యాదాద్రి బ్రహ్మోత్సవ వైభవాన్ని సంతరించుకుంది. ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు 11 రోజులపాటు బ్రహ్మోత్సవ సంరంభం కొనసాగుతుంది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి ఘనమైన పురాణ ప్రశస్తి ఉంది. రుష్యశృంగ మహర్షి పుత్రుడైన యాదర్షి తపోదీక్ష ఫలితంగా నృసింహుడు అర్చనామూర్తిగా యాదగిరిపై వెలశాడంటారు.

బాల్యం నుంచి యాదుడు విష్ణుభక్తుడు. ప్రహ్లాదుడి నుంచి స్ఫూర్తి పొంది, తానూ నరసింహుణ్ని దర్శించాలని సంకల్పించుకున్నాడు. అందుకోసం అడవి బాట పట్టాడు. కొండ జాతి వారికి మార్గమధ్యలో చిక్కాడు. వారి బారి నుంచి రక్షించమని ఆంజనేయుణ్ని ప్రార్థించాడు. ఆ బాలుడి మొర విని హనుమంతుడు వారి చెర నుంచి విడిపించి.. దిశానిర్దేశం చేశాడు. తరులు, జలసిరులు, ఫలపుష్పాదులతోశోభిల్లే ఓ గిరి పై హనుమ సూచన మేరకు యాదుడు తపస్సుకు ఉపక్రమించాడు. యాదుడి దీర్ఘకాల తపస్సు ఫలించింది. యాదర్షిగా నృసింహస్వామిని దర్శించాడు. యాదర్షి పేరిట ఈ కొండ యాదాద్రిగా ఖ్యాతిగాంచింది. ఎందరో చక్రవర్తులు, రాజులు యాదగిరీశుణ్ని కొలిచి తరించారు. కాకతీయ గణపతి దేవుడు, శ్రీకృష్ణదేవరాయలు స్వామిని దర్శించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. భక్తుల సౌకర్యం కోసం నిజాం ప్రభువులు కొండపైకి మార్గాన్ని నిర్మించారు.

యోగశాస్త్రరీత్యా పరిశీలిస్తే... మన శరీరంలో నాభిచక్రం జలస్థానం. దీనిపై సమున్నతంగా ఉండే గిరి వంటి ప్రదేశం మన శిరస్సు. ఈ శిరస్సులో సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రార కమలంలో నారాయణ పరబ్రహ్మాన్ని నెలకొల్పుకోవడమే యాదగిరిపై నెలకొన్న నృసింహుణ్ని దర్శించడం. శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందడానికి భక్తులు దీక్షగా నలభై ఒక్క రోజులపాటు స్వామిని దర్శించి, పూజించి, గర్భాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసే సంప్రదాయం ఈ క్షేత్రంలో ఉంది.

ఇదీ చూడండి:-అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

Last Updated : Feb 26, 2020, 12:16 AM IST

ABOUT THE AUTHOR

...view details