TRS BJP mutual attacks in munugode: భాజపా ప్రచారంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంతంగిలో ప్రచారం ముగిసిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి సైదాబాద్ వెళ్లారు. అక్కడ తెరాస నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి భాజపా జెండా కర్రను విసరడంతో తెరాస మహిళా కార్యకర్తకు గాయమైంది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.
Munugode by election campaign : అనంతరం ప్రచారంలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి రెడ్డిబావి గ్రామం మీదుగా ఆరెగూడం వెళ్లారు. అక్కడ ప్రసంగం ముగించే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరు భాజపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరోసారి పరిస్థితి అదుపు తప్పింది. రాళ్లు విసిరిన నిందితుల్ని పట్టుకోవాలని భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాసేపటి తర్వాత ఏసీపీ ఉదయ్‌రెడ్డి హామీతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. మరోపక్క పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాజగోపాల్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.