ఆరేళ్ల క్రితం ప్రారంభించారు... అయినా పూర్తి కాలేదు ప్రతీ మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలన్న లక్ష్యంతో.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగెడపల్లి కేంద్రంగా 2013లో ఆసుపత్రి మంజూరు చేశారు. భవన నిర్మాణానికి 2013లో 13వ ఆర్థిక సంఘం నిధులతో రూ.55 లక్షలు మంజూరయ్యాయి. దామెర గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతంలోని ఒక ప్రైవేటు వెంచర్‌లో భవన నిర్మాణానికి స్థలం కేటాయించారు. మండల ప్రజలకు అందుబాటులో లేకపోయినా గత్యంతరం లేక అక్కడే నిర్మాణం ప్రారంభించారు. ఆరేళ్లు అవుతున్నా నిర్మాణం పూర్తి కాలేదు. నిధులు సరిపోలేదని గుత్తేదారు నిర్మాణ పనులు నిలిపేశారు.
త్వరగా పూర్తి చేయండి..
పనులు పూర్తి చేయాలంటే ఇంకా 88 లక్షలు అవసరమని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేటికి నిధులు మంజూరు కాలేదు. మరోవైపు గ్రామానికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో భవనం ఉండటం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. మందుబాబులు, పేకాటరాయుళ్లు ఈ భవనాన్ని అడ్డాగా చేసుకుంటున్నారు.
నివేదికలు రాయడానికే పరిమితమైన సిబ్బంది
దామెరలోని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇద్దరు వైద్యాధికారులను నియమించింది. వీరితో పాటు ఫార్మాసిస్టు, ఆరోగ్య విస్తరణాధికారి, పర్యవేక్షకుడు, ఎల్‌డీసీలను కూడా నియమించారు. భవన నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల వైద్యాధికారులు, ఇతర ఉద్యోగులు చౌటుప్పల్‌లోని జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని ఖాళీ గదుల్లో కూర్చుంటున్నారు. కేవలం నివేదికలు రాయడానికి, సమావేశాలు నిర్వహించటానికే పరిమితమవుతున్నారు. ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం పూర్తయితే మండలంలోని రోగులకు వైద్యసేవలు అందించగలుగుతామని మండల వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
చౌటుప్పల్ మండల పరిధిలో 26 గ్రామపంచాయతీలు ఉన్నాయి, లక్ష జనాభా ఉంది. కనీసం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లేకపోవడం వల్ల వారంత ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడం లేదు.
ఇదీ చూడండి :అన్నీ తెలిసి... అనాథలను చేశావేంటమ్మా!