తెలంగాణ

telangana

ETV Bharat / state

భూదానోద్యమానికి బీజం పడ్డది ఇక్కడే...

ఆనాడు వినోబా భావే చెప్పిన మాట మహోద్యమానికి దారితీసింది. దానికి పోచంపల్లి వేదికై ఆ ఊరు నేడు దేశంలోనే కలికితురాయిగా మిగిలింది. వంద ఎకరాల భూమి దానంతో మొదలైన భూదాన్ ఉద్యమం లక్షల ఎకరాల వరకు సాగింది. ఈ భూదానోద్యమానికి వెదిరె రామచంద్రారెడ్డి ముందడుగు వేస్తే... ఈ నడకకు లయ నేర్పి పలువురికి మేలు చేసేలా చేసింది ఆచార్య వినోబా భావే. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

vinoba bhave

By

Published : Nov 15, 2019, 7:59 PM IST

భూదానోద్యమానికి బీజం పడ్డది ఇక్కడే...

గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రచారం చేయడంకోసం ఆచార్య వినోబా భావే... పౌనర్ ఆశ్రమం వీడి దేశమంతటా పాదయాత్ర చేయటానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే నల్గొండ జిల్లాలో జరుగుతున్న దోపిడీలు, కల్లోల పరిస్థితులు తెలుసుకొని పరిష్కార మార్గాన్ని అన్వేషించడానికి పాదయాత్రగా బయలుదేరి... 1951 ఏప్రిల్ 17న ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం హరిజన వాడల్లో తిరిగారు. మరుసటి రోజు ఏప్రిల్ 18న గ్రామంలోని జువ్వి చెట్టు కింద గ్రామస్థులతో సమావేశమయ్యారు. మీ సమస్య ఏమిటని ప్రశ్నిస్తే... తమకు కొంత భూమి ఇస్తే సాగు చేసుకొని జీవిస్తామని గ్రామంలోని దళితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వినోబా భావే అందుకు స్పందిస్తూ మీలో ఎవరైనా భూమి దానం చేసేవారు ఉన్నారా అని ప్రశ్నించారు. అక్కడ జనసందోహంలో ఉన్న వెదిరె రామచంద్రారెడ్డి వెంటనే లేచి తన తండ్రి జ్ఞాపకార్థం 100 ఎకరాల భూమి దానం చేస్తానని ప్రకటించి... పత్రం రాసి వినోబా భావేకు అందజేశారు. నిండు సభలో దానరుపకంగా లభించిన ఆ భూమిని వినోబా భావే పేదలకు పంచి భూదానోద్యమానికి బీజం వేశారు. దీనికి గుర్తుగా సభ జరిగిన ప్రాంతంలోని జువ్వి చెట్టు ను గ్రామస్థులు ఇప్పటికి కాపాడుతూ... అక్కడ వినోబా భావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారు. భూదానోద్యమనికి గుర్తుగా స్థూపాన్ని నిర్మించారు.

44 లక్షల ఎకరాల భూమి పంపిణీ...

వినోబా భావే పోచంపల్లికి వచ్చేవరకు భూదానోద్యమంపై ఆలోచన రాలేదు. ఏప్రిల్18 న యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం భూదానోద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమం వేలాది మంది కార్యకర్తలను ఆకర్షించింది. వినోబా భావే దేశవ్యాప్తంగా దాదాపు 80 వేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి 1970 వరకు 44 లక్షల ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమిని నిరుపేదలకు అక్కడికక్కడే పంపణీ చేశారు. ఇలా భూదానోద్యమానికి నాంది పలికిన గాజులపోచంపల్లి... భూదాన్ పోచంపలిగా మారింది.

ప్రారంభానికి నోచుకోని వినోబా భావే మందిరం...

మాజీ ముఖ్యమంత్రి కిరణ్​ కుమార్ రెడ్డి హయాంలో భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో రూ.50 లక్షల నిధులతో వినోబా భావే మందిరాన్ని పునర్నిర్మించారు. కానీ మందిరం ఆలనా పాలనా చూసే వారు లేక ఎప్పుడూ తాళం వేసి కనిపిస్తుంది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు.

వినోబా భావే మందిరంలో ఆనాటి భూదానోద్యమం చరిత్ర, చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించే ఫొటో గ్యాలరీతో... ఒక గైడ్​ను సైతం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నేటికి ప్రారంభానికి నోచుకోక వినోబా భావే మందిరం వెలవెలబోతోంది.

ఇదీ చూడండి: విభజన హామీల అమలు... నిధుల సాధనే ధ్యేయం...

ABOUT THE AUTHOR

...view details