యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీగా ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. సిబ్బంది, నిధుల కొరతతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రహదారులన్నీ గుంతలమయమయ్యాయి. ప్రయాణ ప్రాంగణం, తంగడపల్లి రోడ్డు, రాంనగర్ ప్రాంతాల్లో మురుగు నీరు ఏరులై పారుతోంది. బీసీ వసతి గృహం పక్కన పట్టణంలోని మురుగు నీరు చేరి విపరీతమైన దుర్వాసన వస్తూ... విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు మెర పెట్టుకున్నా డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నారు.
డంపింగ్ యార్డు కూడా లేదు..
వర్షాకాలం కావడం వల్ల ఎక్కడికక్కడ నీరంతా నిలిచిపోయి దోమలకు అడ్డాగా మారిపోతోంది. దీనితో ప్రజలు డెంగీ, మలేరియా, టైపాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డు లేకపోవడం వల్ల నివాసాల మధ్యే చెత్త పడేస్తున్నారు. వీటి వల్ల చెత్తకుప్పల దగ్గరకి పందులు చేరుతూ హంగామా చేస్తున్నాయి. మిషన్ భగీరథ పనులతో సీసీ రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. చౌటుప్పల్ చెరువు కట్టపై మినీట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైంది.